అప్రాశ్యులు by Bhimeswara Challa (the reading list book TXT) 📖
- Author: Bhimeswara Challa
Book online «అప్రాశ్యులు by Bhimeswara Challa (the reading list book TXT) 📖». Author Bhimeswara Challa
కంగారుతో “వద్దండి. ఆలస్యమయిందండి. యింటికి “పోవాలి.” అన్నాడు రామం,
శ్రీవారు యింటికి వెళ్లి స్వయంపాకం చేసుకుని విందు ఆరగించేటప్పటికి సీమంతం గడచిపోతుంది” అని వంటవానితో నువ్వెళ్లి నేను చెప్పినట్లు చెయ్యి”అంది రజని.
రామం యింక మాట్లాడలేదు. ప్రసాద్ యింటికి వచ్చి అతనికి తెలియకుండా రజనితో విందు ఆరగించటం అతనికి ఎంతమాత్రం యిష్టం లేకపోయింది. రజని ఆ యింటిని స్వంత ఇల్లుగా చూడటం కూడ అతనికి ఆశ్చర్యం కలిగించింది.
రజని నవ్వుతూ “మనస్సులో మెదల్తూన్న ఆ ప్రశ్నని ఎంత సేపు లోపల ఆణచివేసుకుని సతమతమవుతారు? బయటక ఎందుకు అడగరు?” అంది.
రామం ఉలిక్కిపడి “ఏ ప్రశ్న” అన్నాడు.
“అది మీకు తెలుసు. రెండు ఆక్షరాల ప్రశ్న : “ప్రసాద్ ఏడి? అంది. ”
రామం బలవంతాన నవ్వు తెచ్చుకొని ప్రశ్న మీరే చెప్పేరు. యిక సమాధానం కూడ మిరే చెప్పండి” అన్నాడు.
“ఇంట్లో లేరు. నాలుగురోజులనుంచి నాకు కనబడటం లేదు”.
రామం ఆశ్చర్యంతో “నాలుగు రోజులనుంచి కనబడటం లేదా! ఆశ్చర్యంగా వుందే నిన్ననే కమలాకరరావు కనబడ్డాడని చెప్పేడే?” అన్నాడు. రజని నవ్వుతూ! “ఇందులో ఆశ్చర్యపడవలసినదేమున్నది. నాకిది మామూలే ఎవరిష్టం వచ్చినట్లు వారు ప్రవర్తిస్తారు. ఆయన్ని నేను రాత్రింబవళ్లు ప్రేమబంధాలతో బంధించి యింట్లో వుంచాలనే కోరిక నాకు లేదు” అంది.
“రాత్రింబవళ్లు వుండక పోవచ్చు కాని ఢిల్లీలో వుంటూ కూడ నాలుగురోజుల బట్టి యింటికి రాకపోవడం అన్యాయం కదా!” అన్నాడు రామం,
“అన్యాయమేముంది చెప్పండి? నాకంటె ఇంకెవ్వరు గతిలేరు. నే నేకాకిని, అనాధని, ఆయనకు చాలా మంది స్నేహితులున్నారు. ఆప్తులున్నారు. ఆదరించేవారున్నారు. వారివద్దకు వారు వెళ్ళుతూ వుంటారు. ఇది నాకు చాలా సహజంగానే కనబడుతుంది” అంది రజని.
ప్రసాద్ కు ఆప్తులు, ఆదరించేవారు, ఇక్కడ వున్నారని నాకు తెలియదండీ. “ఒక బాబాయ్ వుండేవారు. వారు కూడ చనిపోయారని విన్నాను” అన్నాడు రామం.
రజని నవ్వుతూ “ఆప్తులు, ఆదరించేవారు, బంధువులే అయివుండాలా చెప్పండి. అజ్ఞాతులవకూడదా? వారు దయామయులు. నాబోటి వారికి ఎంతోమందికి ఆశయం యిచ్చేరు. ఇంకా చాలామందికి ఆర్ధిక సహాయం చేస్తూ - వుంటారు” అంది.
ప్రసాద్ దయామయుడని చాలామందికి ఆర్థిక సహాయంచేస్తూంటాడని రామానికి తెలియదు. స్వార్ధ పరుడని స్వీయమే అతనికి సర్వస్వమని అనుకుంటూ వచ్చేడు.
“ఎవరికి ఆర్థిక సహాయం చేస్తున్నాడు చెప్పండి? నేను యింతకుముందు వినలేదే?” అన్నాడు ఆశ్చర్యంతో.
“అంతమాత్రాన అది అసత్యం కాదుకదా వారు ఢిల్లీ లోని హరిజన విద్యార్థులను కొంతమందిని కూడ దీసి వారికొక వసతి చూపించి వారి చదువు నిమిత్తం ఎంతో ధనవ్యయం చేస్తున్నారు. ఇంకా అనేక సంస్థలకి డబ్బు ఇస్తుంటారు. ఉదార స్వభావం, నిర్మలమైన మనస్సు, ఆయనది.వారికి మీరనుకునే నీతినియమాలు లేకపోవచ్చు. అయినా వారు మీ అందరికన్న శతవిధాల ఉత్తములు”అంది.
రజనికి ప్రసాద్ యెడయెంత గౌరవాభిమానాలు వున్నాయో ఆనాడు అతనికి తెలిసివచ్చింది. అంతర్గతంలో కాస్త యీర్ష్యకూడా జనించింది. ఆమాటలో తనను చులకనగా అన్న మాటలు కాస్త బాధపెట్టేయి.
బాధాపూరిత కంఠస్వరంతో “మీరన్నది సత్యమే - కావచ్చు. కాని మానవస్వభావాలు, తత్వాలు ఒకేవిధంగా నిర్మించబడలేదు. అలాగే మానవహృదయాలు కూడ వేరుగా వుంటాయి. అయినా దయ, కరుణ, ప్రేమవున్న మాత్రాన లాభం లేదు. వాటిని క్రియారూపంలో పెట్టడానికి తగిన సంపద శక్తికావాలి. నీతినియమాలందు నీకు నమ్మకం లేకపోవచ్చు. అందుకు నేనేమి అనను, కాని ఎవరికైన సహనం లేకపోతే వారిని నేను సహించలేను.ఒకరిని ఉత్తముడు, యింకోకరిని నీచుడు అనే అధికారం యేమానవునికి లేదు. ఎవరి కర్మ ప్రకారం వారు నడుచుకుంటారు” అన్నాడు
ఆఖరిమాటలు కాస్త వుద్రేకంగా వినబడ్డాయి. రామం అంత వుద్రేకంతో మాట్లాడడం ఆమె అంతకుముందు ఎప్పుడు వినలేదు. ఆమె అడిగిన మాటలు అతనిని గాయపరిచాయని గహించింది.
“సహనం వుండాలనే నేను ఒప్పుకుంటాను. కాని సహనరూపంలో అన్యాయాన్ని అంగీకరించమంటే నేను ఒప్పుకోను” అంది.
సరిగ్గా అదేసమయానికి వంటవాడు భోజనం తయారుగా వుందని చెప్పేడు రజని “లేవండి భోజనం చేద్దాం. ఆకలిగావుంటే ఆవేశాలు విజృంభిస్తాయి” అంది.
“ఆశ్చర్యంగా వుందే, మీరు అలాగ అనటం. ఆవేశాలు ఎందుకు విజృంభించకూడదు? అంటారు కాదా మీరు” - అన్నాడు రామం నవ్వుతూ.
“అవును అది నిజమే. కాని యీ ఆవేశాలు అసహజమైన దేదైనా అధఃపథనానికి దారితీస్తుంది” అంది రజని.
భోజనాలతర్వాత “ఇక నేను వెళతానండీ చాలా థాంక్స్ ” అన్నాడు.
“పదండి మిమ్మల్ని టాక్సీలో ఎక్కించి తిరిగి వస్తాను” అని బయలు దేరింది రజని. ఎంత వారించినా వినకుండా.
టాక్సీకోసం చాలాదూరం నడవవలసివచ్చింది. అర్ధ రాత్రిరోడ్ల మీద ఎక్కడా మానవ సంచారం లేదు. వెన్నెల రాత్రి వీధిదీపాలు కూడా వెలగటం లేదు. నిర్మలమైన నిశ్శబ్దం, నిరాడంబరంగా నివురు కప్పింది. రజని పుచ్చవువ్వులాంటి వెన్నెలలో తన ప్రక్కన నడుస్తూవుంటే, రామం హృదయం ఎప్పుడూ అనుభవించని ఆనందం, సుఖం, శాంతి అనుభవించింది. ఆమె స్వభావానికి వ్యతిరేకంగా రజనికూడ నిశ్శబ్దంగా వుంది. మాడ్లాడితే ఆ సుఖం అంతరించి పోతుందేమో అని భయంతో రామంకూడ మౌనం వహించాడు. అలా ఎంత దూరం నడిచినా ఎక్కడా టాక్సీ కనబడలేదు ప్రశాంత వాతావరణం పున్నమి వెన్నెలలో రజని సౌందర్యం చిందులు త్రోత్కుతూ ప్రకృతినే సవాలు చేస్తున్నట్లుంది. తెల్లటి సిల్కు చీర వెన్నెలలో లీనమైనట్లు కనబడింది, నల్లటి పొడుగాటి జుట్టు బుజాలమీంచి జారుతూ నాట్యమాడుతూంది. మత్తెక్కి మైమరపించే ఆ స్త్రీ ప్రచండ సౌందర్యం రామాన్ని పూర్తిగా తన్మయుడిని చేసింది.
హఠాత్తుగా రజని చెయ్యి గట్టిగాపట్టుకొని వుద్రేకంతో వణకిపోతూ, ఆమెను ఆపి “రజని, అనంతమైన నీ అందం నన్ను మైమరపిస్తూంది. నన్ను ఎక్కడికో లాక్కుపోతూంది. నన్ను నేను సంబాళించుకోలేనేమో అని నాకు భయంగా వుంది” అన్నాడు .
రజని ఏమాత్రము భయపడలేదు. చెయ్యి విడిపించుకోడానికికూడ ప్రయత్నం చేయలేదు. తన చెయ్యి పట్టుకున్న అతని కుడిచేతిపై తన రెండవ చెయ్యి వేసి అతని కళ్ళల్లోకి నిర్మలంగా చూస్తు, సహజ శాంతస్వరంలో “మీరు మిమ్మల్ని సంబాళించుకోలేక పోవచ్చు. అందుకు నేనేమి దోషించను . నా స్త్రీ సౌందర్యం క్షణికంగా మిమ్మల్ని వున్మాదుని చేసిందనడం కొంతవరకు అది సహజమే. కానీ పరిణామాలు ఆలోచించకుండా మీరు ఏపని చెయ్యరని నాకు విశ్వాసంగా వుంది. కేవలం మీరు పురుషులే కాదు సత్పురుషులు. సహృదయులుకూడాను. ఆ విచక్షణాజ్ఞానాన్నే మీరిప్పుడు చేరదీసుకోవాలి” అంది.
అదే సమయానికి దూరంలో కారు లైట్లు కనబడ్డాయి. టాక్సీ అనుకొని రామం చెయ్యి చాపాడు, దగ్గరకు వచ్చికారు ఆగింది. కాని అది టాక్సీ కాదు. అదే ప్రసాద్ కారు చటుక్కున తన కుడి చెయ్యిని రజని చేతుల్లోంచి లాక్కున్నాడు రామం.
ప్రసాద్ నవ్వుతూ “ఏమిటి రజని! నీశి రాత్రి నడిరోడ్డుమీద నాటకం వేస్తున్నారా? లేక మనోవీధిలోని తారా కుమారునికి మన్మధడే నివేదించుకుంటున్నాడా?” అన్నాడు. రామం రజని కేసి భయం భయంగా చూచేడు ఆమె నిజం చెప్పివేస్తుందేమోనని భయంతో ఆమె కేసి చూచేడు
రజని “నవ్వుతూ ఒంటరిగా రోడ్డుమీద నడవటం భయమంటూ నన్ను వెంటలాకొచ్చారు అయన. మా దురదృష్టం. ఎంతదూరం నడచినా టాక్సీ పత్తాయే లేదు. నువ్వువచ్చావు వీరిని మీయింటి వద్ద విడిచి మనం యింటికి పోదాం. నాకు విపరీతంగా నిద్ర ముంచుకువస్తూంది. అనవసరం అబలని రెండు మైళ్లు నడిపించారాయన. ఆ వుసురు వూరికేనే పోదు. పైగా నడిరోడ్డు మీద...” అని అనబోతుంటే రామం కంగారుగా అడ్డు వచ్చి “ఏమిటి ప్రసాద్ -నాలుగు రోజులనుంచీ నారదుడిలాగ ఎక్కెడెక్కడ తిరుగుతున్నావు. రజని నీకోసం కళ్లు కాయలు చేసుకొని ఎదురు చూస్తుంది” అన్నాడు.
“ఈ మాటలను నువ్వు కమల విషయంలో అనినట్లయితే నిజమేమోననిభ్రమపడతాను. కాని రజని విషయంలో అవి నిజమని నన్నునేను మభ్యపెట్టుకుందా మనుకున్నా వీలుపడదు. ఆవిడ ఎవరికోసమైనా ఎదురుచూస్తూందని ఎవరయినా అంటే వారు అసత్యవాదులని, అది అభూత కల్పన అని వెంటనే చెప్పవచ్చు. అలాంటివి ఆమె స్వభావానికి విరుద్ధం” అన్నాడు ప్రసాద్.
“ఇక పదండి-ఇంకా ఆలస్యం చేసారంటే తెల్లవారి పోయేటట్లుంది” అంది రజని.
ముగ్గురు బయలు దేరారు. రామం తన లాడ్జివద్ద దిగి వెళ్ళిపోబోతూంటే రజని నవ్వుతూ. “మళ్ళా ఎప్పుడు కలుసుకుందాము?” అంది.
చాప్టర్ 3
అందరు శనివారం సాయంకాలం ఆగ్రా బయలు దేరారు. కమల రానని చాలాపట్టుపట్టింది. కాని చివరకి కమలాకరం బలవంతంమీద బయలు దేరక తప్పింది కాదు, కాలం గడచేకొలదీ ప్రసాద్ కోపం తగ్గింది. చెంప పెట్టు పెట్టినా అతను దానిని పట్టించుకోకుండా మరునాడేవచ్చి క్షమాపణ చెప్పుకోవటం ఆమెకి ఎంతో తృప్తినిచ్చింది. అప్పుడు కూడా తన ప్రవర్తన కఠినంగా వున్నా, అతను పట్టించుకోలేదు. చివరకు కమలకి యిష్టం లేకపోతే తను రావడం మానేస్తానని కమలాకరంతో చెప్పాడుట కూడాను, అలాంటి పరిస్థితులలో తాను రానని నిరాకరించటం అసమంజసంగా వుంటుందని కమల ప్రయాణానికి బయలు దేరింది.
రజని ఎంతవద్దన్నా ప్రసాద్ స్టీరింగ్ వద్ద కూర్చున్నాడు, నున్నటి ఆ తారురోడ్డుమీద విద్యుద్వేగంతో పోతున్న ఆ కారులోని వారంతా భయంతో వణకసాగారు. కమలాకరం, రామం ఎంత వారించినా ప్రసాద్ వినలేదు. ఆ పరిస్థితిలో ప్రసాద్ ని చూచి కమలకు భయంకూడా వేసింది. ముఖంలోని నరాలన్నీ వుబికి వున్నాయి. గాలికి “జుట్టంతా అగ్నిజ్వాలలా ఎగురుతోంది. ఎవరిమాటల్ని చెవిని వేసుకోకుండా తదేకంగా ముందుకు చూస్తూ నడుపుతున్నాడు. ముందరిసీటులో ప్రసాద్, రామాల మధ్య రజని కూర్చుని వుంది. వెనుక సీటులో కమలా, కమలాకరం కూర్చున్నారు. గాలికి రజని పమిట చెదిరి రామం ముఖం మీద పడి పూర్తిగా కప్పి వేసింది. రామంకు మత్తెక్కినట్లయి క్షణం చీరనుతన చేతిలో పట్టుకుని వుండిపోయాడు. రజని నెమ్మదిగా చీరని లాగుకుంటూ “రామంగారిలో కొన్ని దుశ్శాసనుని లక్షణాలు మూర్తీభవించాయని నాకిప్పటివరకు తెలియదు” అంది నవ్వుతూ. అదృష్టవశాత్తు గాలి విసురులో ఆ మాటలు రామంకి తప్ప ఎవరికి వినబడ లేదు. ఇంకా రజని ఏమయినా అంటుందేమోననే భయంతో రామం “మీకు నమస్కారం పెడతాను. కమలవుండగా మీరు అలాంటిమాటలు మాట్లాడకండి. మీకు పుణ్యముంటుంది” అన్నాడు.
రజని నవ్వుతూ “దుశ్శాసనుడు ధైర్యవంతుడు. నిండు సభలో పాంచాలిని పరాభవించాడు. నలుగురికీ భయపడలేదు, కానీ రామంగారు” అంది.
రజని నవ్వువిని కమలా కమలాకరాలు ఆశ్చర్యపోయేరు. ప్రాణభయంతో వారు సతమతమవుతూంటే ఈమె పరిహాసాలాడుతూ పకపక నవ్వటం వారిని దిగ్బాంతులను చేసింది. కృంగిపోతున్న ధైర్యాన్నంతా కూడదీసుకుని కమల “రజనీ ప్రాణం మీద నీకు తీపి లేదా? ఇంత వేగంగా పోతుంటే ఏక్షణంలో నైనా ప్రాణాపాయం సంభవించును కదా?” అంది.
రజని, “తీపి వున్నంత మాత్రాన అది మనం తప్పించగలమా చెప్పండి ఏక్షణంలో నైనా అలా జరగవచ్చని మీరే చెప్పారు. అందుకనే ఉన్న సమయంలోనే సాధ్యమయినంత వరకు జీవితంలోని సారాన్ని పీల్చివెయ్యాలి అలా చెయ్యకపోతే చివరకు ఇహము, పరము రెండూ శూన్య మవుతాయి.”
కమల కోపంతో “అందుకని ఆత్మహత్య చేసుకోమంటారా మీరు?” అని గట్టిగా “ప్రసాద రావు గారూ మీరు కారు నెమ్మదిగా నడుపుతారా? లేకపోతే కారులోంచి బయటకు దూకమంటారా! చెప్పండి” అంది.
కమల మాటలు విని ప్రసాద్ నవ్వుతూ “ ప్రాణభయంతో కారును నెమ్మదిగా డ్రైవు చెయ్యమంటూలేకపోతే ప్రాణం తీసుకుంటానంటున్నారేమిటి మీరు. చివరకు మిగిలేది మృతకళేబరమే కదా?” అని కారును కొంచెం స్లో చేసాడు. అది చూచి రజని చాలా ఆశ్చర్యమయింది ప్రసాద్ చేత కారు నెమ్మదిగా నడిపించే శక్తి ఎవ్వరికీ లేదని ఆమె అనుకుంటూ వచ్చింది. అసలు నడుపుతూ వున్నప్పుడు మాట్లాడటమనే అలవాటతనికి లేదు. అలాంటి వ్యక్తి ఇలా ప్రవర్తించేసరికి, రజనికి నిజంగా నోటమాట రాలేదు. మదపుటేనుగుని లొంగతీసి మావటివాడు లభించాడనుకుంది. ప్రసాద్ రజని ఆలోచనలను గ్రహించి మరుక్షణంలోనే మామూలు వేగంకి కారును తీసుకువచ్చాడు.
రెండు గంటలలోనే ఆగ్రా చేరుకున్నారు. తిన్నగా తాజ్ వద్దకే వచ్చారు. నిశ్చలమైన ఆ పచ్చటి పున్నమి వెన్నెలో తాజ్ మహల్ అనిర్వచనీయమైన అమావాస్య అందంతో కన్నుల ముందు ఆవిష్కరించింది.
కారు ఆగిన మరుక్షణంలోనే కమల తన్మయంతో తాజ్ వైపుకు పరుగెట్టింది. అది చూచి కమలాకరం కాస్త కంగారుపడ్డాడు. కమలా? ఆగు. ఎక్కడకు వెళ్తున్నావు?” అన్నాడు.
“ఆపబోకండి కమలాకరం బాబూ ! ఆమెలో అణచి వున్న ఆవేశాలకి యి రాత్రి ఆసరా దొరికింది. ఇక ఆమెను హరి బ్రహ్మాదులు కూడ యీ రాత్రి అదుపులో వుంచలేరు” అంది రజని.
ప్రసాద్ నవ్వుతూ “హరి బహ్మాదుల దాకా పోతావెందుకు రజనీ! ప్రక్కన వున్న ప్రసాద్ ను పరిగణించ లేదెందుచేత ? అన్నాడు.
రజని కూడా నవ్వుతూ “పరిగణించక పోలేదు ప్రియా! పనికిరావని మాత్రం అనుకున్నాను ప్రగల్బాలికి కూడా పరీక్ష వుంటుంది. ప్రసాద్ బాబు ” అని ఆమెకూడా నవ్వుతూ పరుగెట్టుకుని వెళ్లి పోయింది.
ఆమె ఆ వికృత నవ్వు, ఆమె ప్రవర్తన ఎందుకో కమలాకరాన్ని కలవర పెట్టాయి ఎందుకో మనస్సు అశుభం సూచించసాగింది. కమల గురించి మనస్సు ఆతురత పడ జొచ్చింది. అతను “రామం కమల ఎక్కడికి వెళ్ళిపోయిందో నాకు ఎందుకో కలవరపాటుగా వుంది. మన యిద్దరము వెళ్ళి వెదుకుదాము” అన్నాడు.
ఆ మాటలు రామానికి ఆశ్చర్యం కలగజేస్తాయి. కమలాకరం ఎంత మిత భాషో, గంభీరుడో, నిశ్చలతో, అతనికి తెలుసు. అలాంటి వాడు ఈనాడు ఈవిధంగా అనేటప్పటికి రామానికి కూడా ఎందుకో అశాంతి కలుగ జేసింది.
రామం సమాధానం చెప్పేలోపల ప్రసాద్ “ఇలా గాభరా పడటం నీ స్వభావానికే విరుద్ధం, కమలాకరం. కమల గురించి కంగారుపడకు. నేను హనుమంతుడిలాంటి వాడిని. నాశక్తి, నాకే తెలియదు” అని ప్రసాద్ కూడా పరుగెట్టసాగేడు.
దానితో కమలాకరానికి నిజంగా కంగారు పుట్టింది. అది గమనించి రామం ఈ పుచ్చపువ్వు లాంటి ఈ పండు వెన్నెల- చలవ రాత్రి ఈ చల్లదనం మనల్ని మత్తెక్కించి మైమరపిస్తోంది” అన్నాడు.
ఇద్దరు ఓదగ్గరకు వచ్చి చూస్తే అక్కడ చాలా మంది జనం వున్నారు. కాని వారిలో ప్రసాద్, రజనీ, కమలలు కనపడలేదు. ఇరువురు చెరొక వైపు విడిపోయి వెదకటం మొదలు పెట్టారు.
ప్రసాద్ కమలకోసం తాజ్ మహల్ లోపల ఎంత గాలించినా కనబడ లేదు. చివరకు అక్కడ వున్న మీనారెట్ కెక్కి వుండునేమోనను సంశయం కలిగి, అవికూడా గాలించేడు, చివరకు మూడవ ప్రయత్నంలో సఫలీకృతుడయ్యాడు. ఒంటరిగా చిట్టచివర నుంచుని పరధ్యానంగా బయటకు చూస్తోంది. నెమ్మదిగా దగ్గరకు వెళ్లి మెల్లిగా “కమలా!, అనిపిలిచాడు. కాని మొదట పిలుపుకి ఆమె సమాధానం చెప్పలేదు. ప్రసాద్ ఈసారి కొంచెం గట్టిగా ‘కమలా’ అని పిలిచాడు. ఆ పిలుపు కూడా ఆమెకు వినబడలేదు. కాని ఆస్తంభంలో ప్రతి ధ్వనించిన ఆ పిలుపు వినబడింది. హఠాత్తుగా నలువైపులా వినబడిన ఆ ప్రతిధ్వనికి ఆమె తుళ్ళిపడి ముందుకు అడుగు వేయబోయింది. అడుగు ముందర అంతా శూన్యం. ప్రసాద్ వెంటనే ఆమె భుజస్కంధంను గట్టిగా పట్టుకోని వెనక్కిలాగాడు. ఆమె తుళ్ళి అతని మీద పడింది. కమల పిలుపు ఎవరిదో, ఆ వ్యక్తి ఎవరో అవగాహన మయింది. అలాంటి సమయంలో బిడియపడటమేమంత ఆశ్చర్యకరమైన సంగతి కాదు. కాని ఆమెలో ఏదో అవ్యకమైన భయం ఆవరించింది క్షణకాలం ఆమెనోట మాట రాలేదు 'మీరా' అని మాత్రం అనగలిగింది. కాని ప్రసాద్ కమల ముఖం తదేకంగా చూస్తూ” నన్ను నువ్వు గుర్తుపట్టినా నన్ను చూచి అసహ్యంచుకుంటావేమోనని నేను భయపడ్డాను. కాని నీ ముఖంలో ఎక్కడ ఏవగింపు కనబడటం లేదు. బలహీనత, భయము కనబడుతున్నాయి. నాకు యిదే ఎప్పుడు అర్ధం కాదు. నన్ను చూచి నువ్వు ఎందుకు భయపడతావు? నాలో అంత భయానకమైన దేముంది? కాని అన్నింటిలోకి ఆశ్చర్యకరమైన దేమంటే నాకు నువ్వంటే తగని భయం ప్రపంచకంలో యింకెవ్వరికి ఇప్పటివరకు భయపడలేదు. నేను చేయదలచుకున్న పనిని చెయ్యకుండా ఎవరు అడ్డగించలేకపోయారు. ఇతరుల యిష్టాయిష్టాలతో నా కేమి నిమిత్తం వుండేది కాదు. కట్టుదిట్టాలు, క్రమశిక్షణ నాకు ఎప్పుడూ లేవు. కాని ఈనాడు నీ మాటని జవదాటటమంటే ఎందుకో మనస్సు వెనక్కు లాగుతూంటుంది. భయం వేస్తూంటుంది నీకు నామీద ఆగ్రహం వచ్చిందనే ఆలోచన నాకు” అని ఇంకేదో చెప్పబోతుంటే కమల అడ్డం వచ్చింది.
ఆమెకు భయంతో ముచ్చమటలు పోశాయి. “ఏమిటలా మాటాడుతున్నారు? మిగతా వాళ్లంతా ఎక్కడని, నన్ను క్రిందకు వెళ్లనీయండి” అంది.
నిజానికి క్రిందకు దిగడానికి ప్రసాదేమి అడ్డం లేడు. అతను “వెళ్లు కమలా, నిన్ను నేను బలవంతగా యిక్కడ వుంచాలనే కోరిక నాకు లేదు” అన్నాడు. కాని కమల ఎంత ప్రయత్నించినా కాలు కదప లేకపోయింది. భయంతో వణికిపోతూంది. దానితో పాటు ఆమెలో ఒక విధమైన బలహీనత కూడా ప్రవేశించింది. క్రిందకు దిగటానికి ప్రయత్నించిన కొలది ఆమెలోని బలహీనత ఎక్కవ కావొచ్చింది. చివరకు అక్కడ నిలబడే శక్తి కూడా ఆమెలో క్షీణించిపోయి అక్కడే ఒక మూల కూర్చుండి పోయింది. ఆమె శారీరక పరిస్థితి చూచి ప్రసాద్ కి విపరీతమైన జాలి కలిగింది.
“చలి వేస్తున్నదా? కమలా” అని అడిగాడు
కమల వణుకుతూ “అవునని” తలవూపింది. ప్రసాద్ వెంటనే తన కోటు తీసి ఆమెపై కప్పి వుంచాడు. నిజానికి ఆమెకేమి చలి వెయ్యలేదు. కానీ ఆమె అ ప్రయత్నంగా అవునని తల వూపింది. కాని ఆశ్చర్యకరమైన దేమంటే దానితో ఆమెలోని ఆ వణుకు పూర్తిగా ఆగిపోయింది. కోటును దగ్గగా లాక్కుని అలాగే లాక్కుని వుండిపోయింది. ప్రసాద్ కూడా ఆ తరువాత కొద్దిక్షణాల వరకు మాట్లాడలేదు. బయట వెన్నెల విరుస్తూంటే చీకటిలో ఆ మారుమూల భయంతో నక్కి కూర్చుని వున్న ఆ అసహాయ స్త్రీ పరిస్థితి ప్రసాద్ కి ఎంతో జాలి వేసింది.” ఇక క్రిందకు వెళ్దాము పద, కమలా, వారంతా మనకోసం వెతుకుతూ వుంటారు. కాని వెళ్లేలోపున నాకు నువ్వొక వాగ్దానం చెయ్యాలి. నా యెడ నీ మనస్సులో ద్వేషానికి తావివ్వవని నాకు మాటివ్వాలి.” అన్నాడు.
“ప్రపంచంలో నాకు ఎవ్వరిమీద ద్వేషం లేదు. ప్రసాద్ బాబూ!. కాని మీరు నాక్కూడ ఒక మాట యివ్వాలి. మీ అభిప్రాయాలు, ఆశయాలు, నాకు తెలుసును. వాటితో నేను సుతరాము అంగీకరించను వాటి గురించి నేను ఆలోచన కూడా చెయ్యను. నేను అల్పసంతృపురాలిని. నాకు వాటితో పని లేదు. మీ ఆశయాల నిరూపణకి నన్ను బలి చెయ్యడానికి, ప్రయత్నించకండి. నాహృదయంలో అనవసరంగా చిచ్చు పెట్టకండి, ఏ పాప మెరుగని నా జీవితాన్ని నాశనం చెయ్యకండి. వేటకాడులాగ నన్ను వెంటాడకండి. చెంపపెట్టు పెట్టానని పగ పట్టిన పాములా నామీద పగ తీర్చుకుంటారా?” అని అటు ఇటు కమల చేతుల్లో ముఖం దాచుకొని ఏడవటం మొదలుపెట్టింది. సానుభూతి పురుష సహజమైనా ప్రేమాభిమానాలు వెల్లివిరిసేయి. కానీ ప్రసాద్ లో అలాంటి భావాలేమి కలగలేదు. అతను ఆమెను ఓదార్చడానికి ప్రయత్నించలేదు. సానుభూతి వాక్యాలైనా పలుక లేదు.
కఠినంగా “కన్నీళ్ళంటే నాకు తగని కోపం. కమల! మానవత్వానికి అవి మాయని మచ్చ. అందులో ఏడవ వలసిందేమీ లేదు. కన్నీళ్లకి కరిగిపోయే నిర్భలుడిని కాదు నేను- ఇక కట్టిపెట్టు కమలా? అన్నాడు.
కట్టిపెట్టడానికి కమల తన శక్తినంతా కూడ దీసుకొని ప్రయత్నించింది. కాని సఫలీకృతురాలు కాలేక పోయింది గట్టు తెగిన ప్రవాహంలో దుఃఖం ఉబుకు వచ్చింది.
కొంతమంది స్త్రీలకు కన్నీరు యింత సులభంగా ఎలా స్రవిస్తాయి నాకర్థం కాదు. రజని కంట కన్నీరు చూడాలని నేను చాలాసార్లు ప్రయత్నించాను. కాని ఎప్పుడూ ప్రయత్నం ఫలించలేదు. ఆత్మాభిమానం వున్న వారెవరు పరుల ఎదుట కన్నీరు కార్చరు” అన్నాడు ప్రసాద్.
ఆ మాటలతో కమలలోని పౌరుషం పైకి వుబికింది. దుఃఖం క్రోధంగా మారింది. మీరు కర్కశ హృదయులు. మీలో దయాదాక్షిణ్యము బొత్తిగా శూన్యం. మీరు మానవాతీతులనుకుంటున్నారేమో? మీరు మానవాధములు మాత్రమే” అంది.
ప్రసాద్ నవ్వుతూ “శభాష్ కమలా, క్రోధం నీకు సహజమైనది. కాని కన్నీరు కాదు. కన్నీరు కార్చినా మనస్సుకరగిద్దామనుకోవటం కేవలం నామమాత్రమే. ఇప్పటివరకు నీవు ఆడిన నాటకమంతా వృధా ప్రయాస. యిక సహజంగా మళ్లీ ప్రారంభించు” అన్నాడు.
తన కన్నీరంతా బూటకమనేటప్పటికి కమల కోపం పట్టపగ్గాలు తెంచుకుపోయింది, తన ఒళ్లు తానే మరచి పోయింది. కుతకుత మనే క్రోధంతో ఏం చెయ్యాలో తెలియక చివాలున లేచి ప్రసాద్ కి చెంపపెట్టు పెట్టబోయింది. కాని ప్రసాద్ ఆమె చెయ్యి పట్టుకుని పక పక నవ్వుతూ “ఈసారి గురి తప్పావే - కమలా?- అయినా ఫరవాలేదు. క్రోధంతో ప్రజ్వరిల్లే నీనయనాలు నన్ను సమ్మోహితుని చేస్తున్నాయి, ఇప్పుడే నువ్వెంతో సహజంగా కనబడుతున్నావు, రజనిని పిలిచి నిన్ను ఇప్పుడు చూపించాలని కోరికగా వుంది. ఒక సారి నేను క్రోధంతో స్త్రీలు అందంగా వుంటారని అంటే రజని కాదంది. “ఆ సమయంలో నన్ను ఆకర్షించేది అందం కాదు. క్రోధం మాత్రమే అంది” ఇప్పుడు నిన్ను చూపించి ఆమెను అడగాలి. ఇది అందమా క్రోధమా రజని అని అన్నాడు.
కమల తన చెయ్యి చివాలున ప్రసాద్ చేతిలో నుంచి లాగుకొని “నువ్వంటేనే నాకసహ్యం. నీ ముఖం చూస్తేనే నాకసహ్యం వెళ్ళిపో యిక్కడ నుంచి” అంది.
ఆ
Comments (0)