క్షంతవ్యులు (Kshantavyulu) by భీమేశ్వర (Bhimeswaea) చల్లా (Challa) (sites to read books for free .txt) 📖
Book online «క్షంతవ్యులు (Kshantavyulu) by భీమేశ్వర (Bhimeswaea) చల్లా (Challa) (sites to read books for free .txt) 📖». Author భీమేశ్వర (Bhimeswaea) చల్లా (Challa)
సుశీ పరిస్థితి నానాటికి క్షీణించిపోతూంది. నా వజ్రాన్ని కాపాడమని భగవంతుడ్ని అహర్నిశలూ ప్రార్థించేవాడిని. ‘‘సుశీని కాపాడు, కావాలంటే నన్ను తీసుకుపో’’ అని రోదించేవాడిని.
ఆనాడు సుశీ పరిస్థితి మరీ విషమించి పోయింది. డాక్టరు చివరి గండం గడవటం చాలా కష్టమని చెప్పారు. డాక్టరుని తీసుకుని సుశీ వద్దకు వెళ్లాను. సుశీ నరకయాతన అనుభవిస్తుంది. డాక్టరు ఇంజక్షన్ ఇస్తానంటే మొదట చెయ్యి చాచలేదు. బలవంతాన చివరకి యివ్వగలిగేడు. కాని మరుక్షణంలోనే ఆమెకు స్పృహపోయింది. మరికొంత సేపటికి స్పృహ వచ్చింది. కాని మాట పోయింది.‘సుశీ, సుశీ.’ అని ఎంతో సేపు పిలిచిన మీదట ఆమె కళ్లు విప్పింది. నాకు ఏదో చెప్పాలని ఎంతో ప్రయత్నించింది. నాకేమి అర్థం కాలేదు. అప్పుడు డాక్టరు ‘‘తన తల మీ ఒడిలో పెట్టుకోమంటూంది.’’ అన్నాడు. సుశీకేసి చూశాను. ఆమె ‘అవును’ అన్నట్లు తల ఊపింది.
ఒక సారి నేను అలా చేస్తానని మాట ఇచ్చాను. సమయానికి ఆమె జ్ఞప్తికి తెచ్చేవరకూ అది మరచేపోయాను. ఆమె కోరిక ప్రకారం చేశాను. అలా చేసిన వెంటనే నేను సర్వం మరచిపోయాను. నాకు అప్పుడు కనిపించినదీ తెలిసినదీ ఒకటే. నాకోసం విధితో పోరాడే సుశీ... ఆమెమీద ప్రేమతో పెల్లుబికే నా హృదయం.... అంతే. మిగతాదంతామరచిపోయాను. ‘సుశీ, సుశీ’’ అంటూ పిచ్చివాడిలా అరచాను. సుశీ ఒక సారి కళ్లుతెరచి చూసింది. ఆచూపుతోనే నాకు వీడ్కోలు చెప్పింది. ఒక సారి చిరునవ్వు నవ్వటానికి ప్రయత్నించింది. పెదిమలు వణికాయి. ఆ పరిస్థితిలో ఆ శ్రమకు కూడా ఆమె తట్టుకోలేక పోయింది. కళ్లు మూసేసింది. అంతే, అందమైన కనురెప్పలు ఇక తెరుచుకోలేదు. డాక్టరు పల్సు చూస్తున్నారు. నేను బయటకి వచ్చేశాను. నాకేసి చూడనీ, నన్ను పలకరించనీ….సుశీని నేను ఇక చూడలేకపోయాను. జరగాల్సిన తతంగం అంతా జరుగుతూంది. ఇక నేనెందుకు.
చాప్టర్ 5
ఆ మరునాడు ఉదయం నిద్రలేచిన వెంటనే ఏదో ఒక పీడకల వచ్చినట్టయింది. మా అమ్మ దగ్గరకు వెళ్లి ‘‘రాత్రి ఏదో పాడుకల వచ్చింది. సుశీకి ఎలావుందో ? ఆస్పత్రికి ఇప్పుడే వెళ్లి వస్తాను’’ అన్నాను. ఆమె కళ్లలోని కన్నీరు చూడగానే సుశీ నిజంగా మరణించిందనే విషయం స్ఫురణకు వచ్చింది. అప్పుడు నాకు కళ్లవెంట నీరు రాలేదు. కళ్లు చీకట్లు కమ్మాయి. అక్కడే కూలిపోయాను.
సుశీ మరణం నాజీవితంలోని అతి ముఖ్యమైన సంఘటన. అది నాలోని కోరికలని, నమ్మకాల్ని సమూలంగా వూడబెరికింది. దైవం మీద నా విశ్వాసం సడలింది. భవిష్యత్తులో నా ఆలోచనల్ని, అభిప్రాయాల్ని, చేష్టలనీ తీర్చిదిద్దింది. దైవం నాకు అన్యాయం చేశాడనే అభిప్రాయం నా హృద యంలో హత్తుకుపోయింది. అది ఎన్నడూ మాసిపోలేదు. చనిపోయినా సుశీకి నేను అన్యాయం చేయకూడదనే దృఢ నిశ్చయానికి వచ్చాను. జీవితంలో ఇక వాటిని గురించి యోచించకూడదనుకొన్నాను. చాలా కాలంవరకు ఆ నిశ్చయానికి కట్టుబడివున్నాను.
ఆ తర్వాత ఇంకొక వ్యక్తి నా జీవితంలో ప్రవేశించి, నన్ను మభ్యపరచి నా మనస్సు కాజేసింది . అయినా చాలా కాలంవరకూ నా హృదయంలో సుశీ కే నేను మొదటిస్థానం ఇచ్చాను. సుశీ స్మృతిని నేనెన్నడూ కలుషితం చెయ్యలేదు. క్షణకాలంకూడా ఆమెను పూర్తిగా మరచిపోలేదు. కాలానికి మానవునికి ఇష్టాయిష్టాలతోప్రవేయం లేదు. నిరంతరంగా నిర్నీతరహితంగా అది ముందజ వేస్తూంది. మానవుని దు.ఖానికి అది కంటతడి పెట్టదు. సుఖానికి చిరునవ్వు నవ్వదు. నా విషయంలో కూడా అదే జరిగింది. జీవచ్ఛవంలా కాలము గడిపాను. సుశీని నానుండి దూరం చేసింది మానవుడు కాదు, ఎవరినైతే బాల్యము నుంచి నమ్ముకుంటున్నానో ఆ దైవమే యిలా చేశాడు. ఇలా శిక్షించటానికి నేను సుశీ చేసిన దోషమేమిటీ? దైవం ఎవరినైతే ప్రేమిస్తాడో వారిని త్వరగా ఈ లోకం నుంచీ తనవద్దకు తీసుకుపోతాడు అంటారు. నిజమేకావచ్చు. సుశీని ఆయన ప్రేమించాడంటే నేను ఆశ్చర్యపడను. అదే నా ఆఖరి ఓదార్పు.
భగవద్గీతలో మరణమంటే భయపడాల్సిన అవసరం లేదు. అది ఒక మాసిన చొక్కా విప్పి కొత్త చొక్కా తొడుక్కోవటం మాత్రమే అని రాసి వుంది. అది నిజమో కాదో నాకు తెలియదు కాని ఒక విషయం మటుకు సుస్పష్టమైంది. కొత్త చొక్కా తొడుక్కున్న పిదప తను ఒకప్పుడు పాతచొక్కా ధరించాననే విషయం మానవుడు మరచిపోతాడు, అతడికి పూర్వజన్మ జ్ఞానమే ఉంటే పాత చొక్కా మార్చటానికి అంగీకరిస్తాడా? అయితే పూర్వ జన్మవుంటే పునర్జన్మ కూడా ఉండే ఉండాలి కదా. సుశీ ఎక్కడైనా పునర్జన్మించిందా? నేను ఆమె తలపుతో సతమతమవుతూంటే ఆమె ఒక పసిపాప రూపంలో వుగ్గుపాలుతాగుతూందా? ఇలాంటి ఆలోచనలు నన్ను అనుక్షణమూ వేధించేవి.
కొన్నాళ్లు పోయిన తర్వాత తిరిగి కాలేజీలో చేరాను. చదువులో మునిగి దుఃఖము మరచిపోదా మనుకున్నాను. అలా సాధ్యపడలేదు. ప్రతి స్థలమూ, ప్రతి వస్తువూ సుశీ స్మృతులను జ్ఞప్తికి తెచ్చేది. క్లాసులో పాఠం వింటూంటే సుశీ నాకేసి కొంటెగా నవ్వుతున్నట్లు కనబడేది. కాలేజీ నుంచి తిరిగి వస్తూంటే వెనుక నుంచీ ఎవరో పిలిచినట్టయ్యేది. దారిలో ఒక స్త్రీ కంఠం ‘‘మీ ఫిజిక్సు నోట్సు ఒక సారి ఇస్తారా?’’ అని అడుగుతున్నట్టు అనిపించేది.
అవి అప్పుడే యవ్వనంలో అడుగుపెట్టిన రోజులు. బతకాల్సిన కాలం ఇంకా చాలా వుండి ఉంటుంది. శేష జీవితమంతా ఇలాగే గడపవలసిందా? అంతకంటే వేరే మార్గము కనబడలేదు. సుశీని దైవం ప్రేమించాడు. అందుకని ఆమెను తీసుకుపోయాడు. నన్ను కూడా అలాగే ప్రేమించాడనటానికి నిదర్శనాలు లేవు.
చాప్టర్ 6
ఆనర్సు చదువు పూరైంది. ఆ వేసంగి శలవులు ఏదైనా ఒక ప్రశాంత వాతావరణంలో గడుపుదామనుకున్నాను. తల్లిదండ్రులు కాదనలేదు. అయితే ఎక్కడికి వెళ్లాలి? ఏదైనా ఒక హిల్ స్టేషన్ కు వెళ్తే, వేసవికాలం చల్లగా బాగుంటుంది. మా నాన్నగారు ముస్సోరీ వెళ్లమన్నారు. ఆయన ఆప్తమిత్రుడొకాయన బాగా డబ్బు గడించి అక్కడ స్థిరపడిపోయాడు. నాగురించి ఆయనకు రాస్తే తప్పకుండా అక్కడకు పంపించమని నొక్కి రాశారు. ‘‘నాకు కొడుకూ, కూతురూ సర్వస్వమూ అయిన మా యశోకి మీ రామానికి ఏమీ తేడా చూపించనని మాటయిస్తున్నాను. నువ్వు రాసిన ఉత్తరం, నేను ఎన్నాళ్లు నుంచో ఎదురు చూస్తూవున్న సంఘటనలా నా మనస్సు పదే పదే చెప్తోంది. ఇది భగవత్సంకల్పం. సందేహం లేదు,’’ అని రాశారు ప్రసాద్ గారు.
సరే, అక్కడకు బయలుదేరటానికే బెడ్డింగు చుట్టాను. నాన్నగారు ఆయన మిత్రుడికి టెలిగ్రాం ఇచ్చారు. కలకత్తా నుంచి ఆ ఎక్స్ ప్రెస్ రెండు రాత్రులు ఒక పగలూ ప్రయాణం చేసి డెహ్రడూన్ ప్లాటుఫాం మీదకి చేరి ఆగింది. పెట్టె, బెడ్డింగు దింపి ప్లాటుఫాం మీద నుంచున్నాను.
“‘నాన్నా! ఆయనేమో”, అన్న ఒక స్త్రీ కంఠం విని పక్కకు తిరిగి చూశాను.
ఒక ముసలాయన, ఒక యువతీ నావైపు నడిచి వస్తున్నారనిచూసి ఆగాను
‘‘నాయనా, నువ్వే కదూ మా శేషు కొడుకు రామానివి? ’’ అన్నారు ఆ ముసలాయన దగ్గరకు వచ్చి.
‘‘ఔనండి. నమస్కారం, మీరు ప్రసాద్ గారు కదా?,’’ అన్నాను.
‘‘అవునయ్యా ,నీ కోసమే ఎదురు చూస్తున్నాము. పద బయటకు వెళ్దాం. అన్నట్టు మరచిపోయాను. ఈవిడే మా అమ్మాయి యశో,” ఆయన ఎంతో ఆప్యాయంగా అన్నారు,
అంతవరకూ ఆమెను నేను సరిగా చూడనేలేదు. అంత చక్కటి అమ్మాయిని నేను ఇంతవరకు ఎప్పుడూ చూడలేదు. బంగారపు ఛాయ ఆమెది. శిల్పి చెక్కిన విగ్రహంలావుంది. పసుపుపచ్చటి పట్టుచీర కట్టుకుంది.
‘‘నమస్కారమండీ,’’ అంది నాకేసి చూసి సన్నగా నవ్వుతూ.
ఆ నవ్వుతో నా మనస్సుతో సదా మెదిలే సుశీ రూపం జ్ఞప్తికివచ్చింది. జవాబివ్వకుండా అలాగే చూస్తున్నాను.
‘‘పద నాయనా బయటకు వెళ్దాం, బాగా అలసి పోయినట్లున్నావు. ఎక్కడ రాజమండ్రి, ఎక్కడ డెహ్రడూన్,’’ అన్నారు ప్రసాద్ గారు.
ముగ్గురమూ బయటకి బయలుదేరాము. బయట కారులో సామానుపెట్టి బయలుదేరేముందు ఆమెకు ప్రతి నమస్కారం చెయ్యలేదని జ్ఞాప్తికి వచ్చి, ‘‘నమస్కారమండీ,’’ అన్నాను.
‘‘ప్రతి నమస్కారమండీ,’’ అంది యశో నవ్వుతూ.
శశి చనిపోయిన తరువాత మొదటిసారిగా నేను నవ్వు అణచుకోలేక పోయాను.
ఆమె అయితే నాకేసి ఎంతో ఆశ్చర్యంగా చూస్తూఉంది. నాలో దేనినో వెదకుతున్నట్టనిపించింది. బలవంతాన నవ్వు ఆపుకుంటూన్నట్లు కూడా అనిపించింది. యశో చాలా కొంటెపిల్లని గ్రహించాను.
పాములా వంకలు తిరిగి ఉన్న ఆ రోడ్లమీద కారు పరుగెడుతూంది. కవులు ప్రకృతి సౌందార్యాని కెందుకు ముగ్ధులయ్యారో నాకు అప్పుడు తెలిసింది. ఎత్తైన ఆ కొండలు జలజలా ఆ రోడ్డుమీదకే వురికే జలపాతాలు కన్నులపండువగా ఉన్నాయి. మలుపుతిరిగితే ఎదురయ్యే మబ్బుల దృశ్యం మనోహరంగా ఉంది.
పక్కనే కూచున్న ప్రసాద్ గారికి భయపడో ఏమో డ్రైవర్ కారు నెమ్మదిగా పొనిస్తున్నాడు. ముగ్గురమూ మౌనంగానే ఉన్నాము.
ఇంతట్లో ‘అబ్బా! ఎంత బావుంది’ అంది యశో మమైకమయిన కంఠంతో. నా పక్కన కూర్చుని కిటికీలోంచి బయటకు చూస్తూ తన్నుతాను మరచి అన్నమాటలివి. పచ్చటి ఆమె ముఖం మీద ముంగురులు నాట్యం చేస్తున్నాయి. ఉదయభానుని లేత సూర్యరశ్మి ఆమె ముఖానికొకింత శోభనిస్తూంది. మనోరంజకమైన ఆమె ముఖాన్ని తదేకంగా చూస్తూ ఉన్నాను.
‘‘ఏమిటో ఈ నేచర్ ని చూస్తూవుంటే నన్ను నేను మరచిపోతాను. ఇలాంటి ప్రదేశం ఎలా వదిలిపెట్ట బుద్ధి పుడుతుంది చెప్పంది,’’ అంది హఠాత్తుగా ఆమె నా వైపు తిరిగి కాస్త సిగ్గుపడుతూ...
‘‘అవును నాయనా యశోకి ప్రకృతి అంటే తీరని పిచ్చి, ముస్సోరి వదిలి ఎక్కడకు రానంటుంది,’’ అన్నారు ప్రసాద్ గారు.
ముస్సోరి చాలా మనోహరంగా ఉంది. ఏవైపు చూసినా చల్లటి మేఘాలు చక్కలిగింతలు పెడుతున్నాయి. అక్కడక్కడ దట్టమైన మబ్బులు ఒక గజంలోని వస్తువుల్ని కూడా మరుగుపరుస్తున్నాయి.
ఆఖరికి వారి బంగళా చేరేము. బయట ఒక ముసలి బంట్రోతు ఉన్నాడు. .
‘‘ఈ కారు మాది కాదండోయ్. ఒక స్నేహితురాలి వద్ద పుచ్చుకున్నాను,’’ అంది యశో మేము కారు దిగుతుంటే.
ఆమె అలా అనటం కాస్త అసభ్యంగా వుందనిపించింది నాకు.
‘‘రామదీన్. సామాను మేడమీద అమ్మాయి పక్కగదిలో పెట్టించు. పద నాయనా, లోపలికి పద,’’ అన్నారు ప్రసాద్ గారు అతనితో.
చాప్టర్ 7
ఆరోజు మధ్యాహ్నము నేను నిద్రలేచి మేడమెట్లు దిగి వస్తూన్నాను. క్రింది గదిలో యశో ఎవరితోనో మాట్లాడుతూంది. యశో అంటోంది ‘‘అబ్బ. నేను రాలేను రాజేంద్రబాబు. ఈ ఒక్కరోజుకి నన్ను క్షమించలేరా?’’
అతగాడు ఏమి జవాబిచ్చాడో నాకు సరిగా వినబడలేదు కాని మరల యశో అంది, ‘‘నన్ను విసిగించకండి రాజేంద్రబాబు. నేను రావడానికి ఎంత మాత్రము వీల్లేదు.’’
ఈసారి కంఠస్వరాన్ని హెచ్చించి అతను, ‘‘అతిథులు మీ ఇంటికి రావటం ఏమీకొత్తకాదు. యశో, అతిథులు ఇంట్లో వుండగా పిక్చర్సుకీ, పిక్నిక్ కీ నాతో చాలాసార్లు వచ్చావు. అసలు ఈ అతిథి ఎవరు? నీకు ఇంతట్లో అతని మీద ఇంత అనురాగము ఎలా పుట్టుకొచ్చింది. నాకు జవాబులు కావాలి ఈ ప్రశ్నలకి,’’ అంటున్నాడు.
నేను తిరిగి పోదామనుకుంటూంటే యశో నన్ను చూసింది. ఇంకా ఏమైనా అంటాడేమోనని ఆమె లేచి నుంచుని ‘‘అప్పుడే వచ్చేసారే క్రిందకి, మీరు. రాత్రి సరిగా నిద్ర వుండివుండదు. మిమ్మల్ని మెలకువ వచ్చేవరకు లేపవద్దని అన్నారు నాన్నగారు,’’ అంది.
నేను ఇక తప్పదనుకుని క్రిందకు వచ్చాను. యశో లేచి చిరునవ్వు తెచ్చుకుని నన్నతనికి పరిచయం చేసింది. ‘‘ఈయన రాజేంద్ర కుమార్. ఈ ఏడాదే యం.బి.పాసయ్యాడు. డూన్ లో ప్రాక్టీసు పెట్టారు. నాన్నగారికి బాగా తెలుసు. ఈయన అప్పుడప్పుడు వస్తూంటారు.’’
చివరి రెండు వాక్యాలూ అసందర్భమనిపించాయి నాకు. లోపలి నుంచి ప్రసాద్ గారు వచ్చారు.
‘‘ఏమమ్మా యశో. మీ ముగ్గురూ యేమైనా ప్రోగ్రాం వేసుకున్నారా?’’ అన్నారాయన మా ముగ్గురినీ చూసి
‘‘లేదు నాన్నా. ఈ వేళేకదా వచ్చారు ఈయన. ఇప్పుడే అన్నీ చూపిస్తే తర్వాత ఏం చెయ్యటం? ఈ రోజు మన ఇల్లంతా చూపిస్తాను, మళ్లీ మరచిపోకుండా,’’ అంది యశో.
రాజేంద్ర మాకేసి కాస్త కోపంగా చూస్తున్నాడు. ఆయనని చూస్తే నాకు కాస్త జాలివేసింది.
‘‘పోనీ, మీరు ఆయనతో కలసి బయటకు వెళ్లిరాకూడదా? నేను ఈలోపు సామాను సర్దుకుంటాను,’’ అన్నాను.
రాజేంద్ర చిరునవ్వు నవ్వాడు.
‘‘అయితే నన్ను అప్పుడే వదలించుకోవాలని చూస్తారా? అయినా నేను ఈరోజు ఇంట్లోనే ఉంటాను. ఇంకొక సంగతి రామంబాబూ. నన్ను ఎందుకు ‘మీరు’ అని సంబోధిస్తున్నారు. లేకపోతే నా పేరు మీకు నచ్చలేదా చెప్పండి. ‘యశో’ అని పిలవటం ఇష్టంలేకపోతే ‘రాజ్యం’ అని పిలవండి. నా పూర్తిపేరు ‘యశోరాజ్యం’ అనే సంగతి మీకు తెలియదనుకుంటాను,’’ అంది యశో కొంచెం కోపంగా
నాకు యశోమీద కొంచెం కోపం కూడా వచ్చింది. ఆమె నలుగురి ఎదుట అతిథిని అలా ఎందుకు పరాభవించింది? ఇది అపరిమిత అనురాగమా లేక అంతులేని అహంకారమా? అదీకాక అంతమంది ఎందుట ఆమె అప్రస్తుత సంభాషణకి నేను కాస్త సిగ్గుపడ్డాను.
‘‘సరేలేండి అలాగే పిలుస్తాను,’’ అని మళ్లా జ్ఞాపకానికి వచ్చి ‘‘సరే యశో. అలాగే పిలుస్తాను.’’ అన్నాను.
యశో నా ఎదుట తనతో బయటకి రా నిరాకరించినందుకు రాజేంద్ర బాధపడుతున్నట్టు కనిపించాడు. కొంచెంసేపు పోయిన తర్వాత అతను వెళ్లిపోయాడు. వెడుతూ వెడుతూ నన్ను వాళ్ల ఇంటికి ఒకసారి రమ్మని ఆహ్వానించాడు.
తరువాత యశో నన్ను వెంటబెట్టుకుని వాళ్ల బంగళా చూపించటానికి దారితీసింది. ఆపని ఒక అరగంటలోనే అయిపోయింది. అది ఒక వంక మాత్రమేనని గ్రహించాను. వాళ్ల ఇంట్లో తిరుగుతున్నంత కాలమూ నేనేమీ మాట్లాడలేదు. యశో కూడా చాలా ముక్త సరిగా ఉంది.
అంతా అయిపోయి నేను గదిలోకి వెళ్తుంటే, యశో వరండాలో నుంచుని,
‘‘మిమ్మల్ని ఒక్క మాట అడిగితే కోపంరాదుకదా రాంబాబు,’’ అంది.
‘‘నేనెవరిని నీమీద కోపగించటానికి ? అడుగు,’’ అన్నాను నేను వెనుదిరక్కుండానే,.
‘‘ఇందాక మీరు రాజేంద్ర, మా నాన్నగార్ల ఎదుట నన్ను ఎందుకు అవమానించారు,’’ అంది.
నేను ఆశ్చర్య చకితుడనయ్యాను.
‘‘యశో, నేను నిన్ను అవమానించలేదు. అవమానించింది నువ్వు, రాజేంద్రని. ఇది చాలా స్పష్టమైన సంగతి,’’ అని దృఢంగా, కాస్త కఠినంగా అన్నాను.
యశోలో ఆవేశం హెచ్చింది.
‘‘మీతో సరదాగా కబుర్లు చెప్పుదామని ఇంట్లో ఉండిపోదామంటే, నన్ను బయటకి వెళ్లిపోమనటం అవమానించటం కాదా? నేను మీతో ఉండటం మీకు ఇష్టంలేదని, నన్ను వదిలించుకోవటానికి ప్రయత్నిస్తున్నారని చెప్పటం కాదా? ఇక రాజేంద్ర సంగతి. ఆస్తమానమూ ఆయనమాటే చెల్లాలా. నామాటకు విలువలేదా? ఈ ఒక్కరోజుకే నన్ను క్షమించమంటే ఆయన ఎందుకు అంత పట్టుపట్టాలి?’’ అంది తీక్షణంగా.
ఆమె అన్నిమాటలు అంత రుసువుగా మాట్లాడగలదని నేను ఊహించలేదు. కాస్సేపు మాట్లాడలేదు.
‘‘నేను అంతదూరం ఆలోచించలేదు, యశో ఆలోచించివుంటే నేనలా అనేవాడిని కాదేమో. నేనెంతసేపూ రాజేంద్ర విషయమే ఆలోచించాను. నీ సంగతి గుర్తుకు రాలేదు ఎందుచేతనో?’’ అన్నాను.
అయినా యశోకి కోపం పోలేదు.
‘‘కాదు మీరు కావాలనే అన్నారు. నన్ను నలుగురి ఎదుట చిన్నబుచ్చాలనే అన్నారు,’’ అంది తల అడ్డంగా తిప్పుతూ.
‘‘అయితే నన్నిప్పుడేమి చేయమంటావు యశో. నా సత్సంకల్పాన్ని రుజువు చేసుకోవడానికి నేనేం చెయ్యాలి? అయినా నేను ఒక సంగతి అడుగుతాను. నన్ను అతిథిగా మాత్రమే చూస్తూన్నావా లేక ఇంకొక విధంగా చూస్తున్నావా? నా ఈ రెండు ప్రశ్నలకి జవాబివ్వాలి,’’ అన్నాను నేను నీరసంగా.
‘‘చెప్పమంటారా?’’ అంది నా ముఖంలోని పరిశీనగా చూస్తూ.
“‘చెప్పు యశో,’’ అన్నాను.
‘‘ఉహూ! ఇప్పుడుకాదు. మరొక్కప్పుడు చెప్పుతాను. ఈ స్థితిలో మీరు అర్థం చేసుకోలేరు,’’ అని చరచరా తన గదిలోకి వెళ్లిపోయింది.
ఆ రోజు రాత్రినా అలవాటు ప్రకారం చాలా సేపటి వరకు చదువుతూ మేల్కొని వున్నాను. తలుపు ఎవరో తట్టినట్టయి ‘‘ఎవరు. రామదీన్, లోపలికి రా,’’ అన్నాను.
లోపలికి వచ్చింది యశో! రామదీన్ కాదు.
‘‘టైమెంత అయిందో మీకేమన్నా తెలుసా? ఇంకా మేలుకునే వున్నారెందుచేత? నిద్రపోవాలనే ఆలోచన మీకున్నట్టులేదు,’’ లోపలికి వస్తూ అంది.
‘‘నాకు ఆలస్యంగా పడుకోవటం అలవాటు యశో,’’ అన్నాను నేను నవ్వటానికి ప్రయత్నిస్తూ.
ఆమె ముందు నేనొక చిన్నపిల్లవాడినైపోయాను.
‘‘ఈ అలవాటు ఎందుకు చేసుకున్నారు? అలవాటుకు కూడా మొదలు అంటూ వుంటుంది కదా? ఇంత పెద్దవారైనా మీ ఆరోగ్యం సంగతి మీరు చూసుకోకపోతే ఇంకెవరు చూస్తారు? ఇక్కడున్నంతకాలం మీ ఆరోగ్యం సంగతి మా బాధ్యత. దయతో ఇది జ్ఞాపకముంచుకోండి. ఇవాళే రామదీనుతో చెప్తాను... పది గంటలకల్లా ఇంట్లో లైట్లన్నీ ఆర్పివేయమని,’’ అంది.
యశో నా చేతుల్లోంచి పుస్తకము తీసుకుని లైటు ఆర్పివేసింది. యశో వెంటనే వెళ్లిపోతుందనుకున్నాను కాని ఆమె అక్కడేనుంచుంది.
‘‘యశో ఇంకా ఇక్కడేవున్నావా?’’ అన్నాను ఆశ్చర్యంగా.
‘‘అవును, మిమ్మల్ని ఒక విషయం అడుగుదామని ఉన్నాను,’’ అంది నిబ్బరంగా.
‘‘అయితే ఆలస్యందేనికి అడుగు,’’ అన్నాను
‘‘మీ పేరు నాకు నచ్చలేదు. ఇంకోక పేరు పెట్టి పిలువాలని అనుకుంటున్నాను. మీ ఆజ్ఞ అయితే.’’
‘‘ఏమని పిలుస్తావు? ఏదైనా జంతువు పేరు పెడ్తావా లేక రాక్షస స్మరణ చేసుకుంటావా?’’ అన్నాను ఆచీకటిలో నవ్వుతూ.
“బాదల్ బాబు, కాదు, బాదకబాబు,’ అంది యశో ఏదో స్వప్నాల్లో తేలుతున్నట్టుగా
నా ఆశ్చర్యానికి అంతులేదు. ఈ పేరు నేనంతకు ముందు ఏనవల్లో కూడా చదివిన గుర్తులేదు.
‘‘అంటే ఏమిటి? అసలు నీకు ఈ కోరిక ఎందుకు కలిగింది. చెప్పు యశో?’’ అన్నాను.
‘‘ఆ విషయం మీరెప్పుడూ అడుగకూడదు. అయినా ఆ విషయం బహుశా రానురాను మీకే తెలుస్తుంది,’’ అని ఆమె తలుపువైపు వెళ్లిపోతోంది ఆనిపించింది.
‘‘అందరి ఎదుటా అలాగే పిలుస్తాను యశో?’’ అన్నాను అనాలోచితంగా నేను.
‘‘అంటే మీ ఉద్దేశం ఏమిటి? నలుగురి ఎదుటా అలా పిలిస్తే సిగ్గుపడతారా? సరే. అయితే ఇది మీ ముద్దు పేరు,’’ అంది యశో.
నా జవాబుకి ఎదురు చూడకుండా గబ గబా బయటకు వెళ్లిపోయింది.
ఆ రాత్రి సరిగా నిద్ర పట్టలేదు. యశో మాటల అర్థం నేను అస్సలు గ్రహించలేకపోయాను. అతి గారాబంగా పెరిగిన యువతి ఈమె అనిమాత్రం అర్ధమైంది . కారులో తల బయటకు పెట్టి ‘అబ్బా ఎంత బావుంది’ అన్న యశోకి, కోపంతో ప్రజ్వరిల్లిపోతూ ‘మీరు నన్ను కావాలని అవమానించారు’ అన్న యశోకి, చివరికి చీకట్లో ‘మీ పేరు నాకు నచ్చలేదు’ అన్న ఆమెకి నాకేమి పోలికలు కనబడలేదు. ఒక్క రోజులో ఈమె ఇంత చనువు నానుండీ ఎలా సంపాదించింది? ఈమెకు సుశీ విషయం తెలియదా? మా నాన్నగారు ఆ విషయం యశో తండ్రికి రాశారనే ఉద్దేశంతో నేనున్నాను, అయితే ఈయన తనతో ఆ విషయం చెప్పలేదా? ఏమయితేనేం, మనస్సులో ముద్రితమైన సుశీ ఛాయా పటాన్ని నేను చెరపలేను. అయితే ఇక మిగిలింది ఒకే ఒక ప్రశ్న. నా కర్తవ్యం ఏమిటి?
చాప్టర్ 8
మరునాడు నిద్రలేచేటప్పటికి చాలా పొద్దుపోయింది. కళ్లు తెరచేటప్పటికి ఎదురుగుండా యశో నా బట్టలు సర్దుతూ కనబడింది.
‘‘నీ కెందుకు యశో ఈ పనులన్నీ ? నేను సర్దుకుంటాను తర్వాత,’’ అన్నాను, నేను లేచి కూర్చుని.
‘‘ఈ విషయం గురించి తర్వాత మాట్లాడుకుందాం, ముందర ముఖం కడుక్కుని రండి, లేక మీకు పాచిపళ్లతో కాఫీ తాగటం అలవాటా?’’ నవ్వుతూ అంది యశో.
నిజం చెప్పాలంటే నిద్రలేచిన వెంటనే కాఫీ ముందరవుంటే గడగడా తాగేస్తాను. కాని ఎందుకో యశో ఎదుట అది చెప్పడానికి భయం వేసింది. వెంటనే మంచంమీంచి లేచి బాత్రూములోకి వెళ్లిపోయాను.
నేను తిరిగి వచ్చేటప్పటికి యశో గదిలో లేదు. ఒక ఫ్లాస్కు, ప్లేటులో టిఫినూ, ఒక చీటీ ఉన్నాయి. ఆ చీటీలో ‘‘బాదకబాబూ. ఫ్లాస్కులో కాఫీవుంది. మీరు స్నానం చేసి సిద్ధంగా ఉండండి. మనం బయటకి వెళ్తున్నాం’’ అని ఉంది.
ఒక గంట పోయిన తర్వాత నేను యశో క్రిందికి వస్తూంటే ప్రసాద్ గారు ఎదురయ్యారు.
‘‘యశో. ఎక్కడకు ప్రయాణం?’’ అడిగారు ఆయన
‘‘ఈయన్నిసరళ దగ్గరకు తీసుకువెళ్తా నాన్న,’’ అంది యశో.
సరే అని ఆయన వెళ్లిపోయారు.
‘‘సరళ ఎవరు యశో? ఆమె దగ్గరకి నేనెందుకు?’’ బయటికి వచ్చిన తర్వాత నేనడిగాను.
“సరళ నా స్నేహితురాలు, వాళ్ల నాన్నగారు బాగా ధనవంతులు. మిమ్ములను గురించి సరళకు చాలా చెప్పాను. ఆమెకు మిమ్మల్ని చూపించి నా పందెం గెలుచుకుంటాను,’’ అంది యశో నవ్వుతూ.
నాకేమీ అర్థంకాలేదు.
‘‘ఏమిటిదంతా యశో. నా గురించి సరళకు ఎప్పుడు చెప్పావు? పందెం ఏమిటి? నేను నిన్ననేగా ఇక్కడికి వచ్చాను. అంతకుముందు నా గురించి నీకేమీ తెలియదుగా?’’ అన్నాను.
‘‘కంగారు పడకండి. బాదకబాబూ. రావటం మీరు నిన్ననే వచ్చారు ఇక్కడికి. కానీ, మీకోసం చాలా కాలం నుంచీ ఎదురుచూస్తూ ఉన్నాను. లేకపోతే ఒక్కరోజులో మీతో ఇంత చనువు ఎలా ఏర్పడింది చెప్పండి? సరళతో ఇదే చెప్పాను. ఆమె నమ్మలేదు. ఇవాళ మిమ్మల్ని చూపించి హాకిమన్స్ లో డిన్నరూ, పిక్చరూ అడుగుతాను మన ఇద్దరికీ,’’ అంది.
యశో పెదవులమీద చిరునవ్వు వెలుగుతూంది. ముఖములోంచి గర్వమూ, అహంభావమూ తొంగి చూస్తూన్నాయి.
అక్కడకి దగ్గరలోనే ఉంది ఈ సరళ ఇల్లు కూడా. ఇంటిని బట్టి ఇంటి యజమాని బాగా ధనికుడని గ్రహించాను. ఇల్లు దగ్గరకు వచ్చిన వెంటనే యశో “సరళా, సరళా” అంటూ లోపలికి పరుగెత్తింది.
యశో కేకలు విని మేడమీదనుంచి ఒక యువతి పరుగెత్తుకుంటూ వచ్చి యశోని కౌగిలించుకుంది. బాగా పొడుగ్గా ఉంది. ఆమె యశో అంత తెలుపు కాకపోయినా మొత్తం మీద తెలుపనే చెప్పాలి. నిండైన విగ్రహం, చిలిపి కళ్లు, ఆమెలో కొట్టవచ్చినట్లు కనబడుతున్నాయి.
‘‘ఏమిటి యశో. ఇవాళ చాలా హుషారుగా ఉన్నావే. ఇవాళ మీ ఇంటికి ...ఎవరు ఆయన? నీతో వచ్చారా?’’
Comments (0)