క్షంతవ్యులు (Kshantavyulu) by భీమేశ్వర (Bhimeswaea) చల్లా (Challa) (sites to read books for free .txt) 📖
Book online «క్షంతవ్యులు (Kshantavyulu) by భీమేశ్వర (Bhimeswaea) చల్లా (Challa) (sites to read books for free .txt) 📖». Author భీమేశ్వర (Bhimeswaea) చల్లా (Challa)
ఆనాడే ప్రయాణం, మధ్యాహ్నం యశో గదిలోకి వెళ్లాను యశో పక్కమీద పడుకుని ఉంది. కళ్లు మూసుకుని ఉంది, కాని నిద్రపోవటం లేదు అని నాకు తెలుసు.
“యశో,” అన్నాను మెల్లిగా ఆమె చెవిలో.
యశో కళ్లువిప్పి చూసింది
‘‘సామానంతా సర్దుకున్నారా?’’ అంది మందహాసంతో.
‘‘నేను సర్దుకోవటానికేముంది. యశో, నిన్నరాత్రి కూర్చుని నీవేగా సర్దావు,’’ అన్నాను.
యశో జవాబేమీ ఇవ్వలేదు చాలాసేపు .
‘‘అయితే ఈ వేళ వెళ్లిపోతారన్నమాట,’’ అంది ఆఖరికి కళ్లు మూసుకుని.
ఆ మాట తనలో తను అనుకున్నట్టు వుంది. అందులో జీవంలేదు; ఆశ లేదు; ఉత్సాహం లేదు; ఉద్రేకంలేదు; భయంకరమైన తిరుగులేని నిశ్చయంమటుకు ఉంది.
‘‘నామీద కోపం లేదు కదా . నాకు తెలుసు నీకు నేను చాలా బాధ కలిగించానని. కానీ.... కానీ నేనేమీ చెయ్యను?’’ అన్నాను. గొంతు పెగలదీసి అన్న మాటలవి.
ఆతరువాత నా కంఠం అవరుద్ధమైంది.. ఆ గది అంతా నిశ్శబ్దమైంది.
తను కళ్లు తెరచి నావైపుచూస్తూ అంది, ‘‘మీమీద కోపగించుకోవటానికి మీరేమి చేశారు? మీరు మీ కర్తవ్యాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. ఇక ఈ నాటినుంచీ నేను నా కర్తవ్యాన్ని నిర్వహించాలి.’’
‘‘ఏమిటి అది యశో?’’ అనడిగాను.
‘‘జీవితాంతం ఈ హృదయంలో ఇంకొకరికి చోటివ్వను. సర్వ వేళలా నా సర్వస్వమూ మీరే,’’ అంది.
‘‘లేదు, యశో, నువ్వు పొరపడుతున్నావు. నీ జీవితం ఇంత చిన్నవయస్సులో విషాదపూరిత మవ్వటానికి వీల్లేదు నేను ఇక్కడికి రాక మునుపు నేను వస్తానని నీ మనస్సు చెప్పేదన్నావు; అప్పుడు నువ్వ ఊహించుకున్న ‘బాదల్ బాబును’ నాలో చూశావు, ఇప్పుడు నువ్వ కావాలను కుంటున్న ‘రామం బాబు’ వేరెవరో ఎందుకు కాకూడదు?‘‘ అన్నాను.
యశో తల అడ్డంగా తిప్పుతూ అంది, ‘‘కాదు నేను పొరపడలేదు. కాకపోయినా నాకు చింతలేదు. మిమ్మల్ని ఇన్నాళ్లూ ఇంత ప్రేమించాను. ఇదంతా బూటకమేనా? అలా ఎన్నటికీ జరుగదు. మీరలా మాట్లాడకండి. ఇవాళ ఆఖరిరోజు, ఇది కూడా సుఖంగా గడిచిపోనివ్వండి,’’ అంది.
యశో కలవారి బిడ్డ. శైశవం నుంచీ అతి గారాబంగా పెరిగింది. ఆమె ఎవ్వరినీ చేయి చాచి అడిగేదికాదు. ఇప్పుడు వ్యాకులచిత్తురాలై వణికే కంఠంతో యాచించిన భిక్షశూలంలా హృదయాన్ని చేదించింది.
‘‘మీరు నన్ను పూర్తిగా మరచిపోరు కదూ బాదల్ బాబు,’’ అంది మరల కాసేపాగి.
‘‘ఇది నువ్వు అడగాల్సిన ప్రశ్నకాదు. యశో, ఇంత జరిగిన తర్వాత నిన్ను మరచిపోతే నాలో మానవత్వం లోపించి ఉండాలి,’’ అన్నాను, కన్నీళ్లు బలవంతాన ఆపుకుని.
యశో చీరకొంగు నోటిలో కుక్కుకుని అవతలివైపుకి తిరిగిపోయింది. అపరిమిత దుఃఖాన్ని సహనంతో సహిస్తున్న ఆమె ధైర్యాన్ని నేను చెదరగొట్టాను. ఆమె దుఃఖ కారకుడిని నేను. ఆమెని ఓదార్చటానికి ప్రయత్నించటం ఎంత మూర్ఖత్వం?
లేచి నుంచుని, ‘‘ఇక నేను వెళ్లిపోతాను. యశో, ఇంతకంటె ఆనందకర పరిస్థితుల్లో తిరిగి తప్పకుండా కలుసుకుంటాము. నీ దగ్గర నుంచీ శభలేక వచ్చిందంటే రెక్కలు కట్టుకు వాల్తాను’’ అన్నాను.
యశో ఇంకా అటువైపే తిరిగి ఉంది.
‘‘సరే వెళ్తాను,’’ అన్నాను.
‘‘ఆగండి. ఇంకొక యాచన ఉండిపోయింది’’ అంది యశో లేచి నిల్చుని.
‘‘ చెప్పు యశో,’’ అన్నాను.
‘‘భర్తకి పాదాభివందనం చేయాలని చిన్నతనంలో మా అమ్మ చెప్పేది. నన్ను ఆశీర్వదించండి,’’ అని వంగి నమస్కరించింది.
‘‘ఎప్పుడూ సుఖంగా ఉండు యశో,’’ పళ్లను గట్టిగా నొక్కిపెట్టి, గుప్పిడి బిగించి అన్నాను.
బయటికి వచ్చేశాను, నన్ను నేను నమ్ముకోలేక.
చాప్టర్ 15
నేను రాజమండ్రి తిరిగి చేరుకున్నాను. దారిలోఎన్నోసార్లు తిరిగి వెళ్లిపోదామనిపించింది. శిలా విగ్రహంలా ఫ్లాటుపారంమీద నిల్చున్న యశో స్మతి నేనెలా మరువగలను.
‘‘మీ నిశ్చయాన్ని భంగపరచను బాదల్ బాబూ,’’ అని రైలు కదలబోయే ముందు చెప్పింది కంటతడిపెట్టి.
ఎవరికోసమని నేను యశోరాజ్యాన్ని వదిలి వచ్చాను? సుశీల చనిపోయింది; యశోని తిరస్కరించాను; ఇక మిగిలింది నేను.
యం.ఎస్.సీ లో చేరాను. చదువులో పడి యశోని మరచిపోవటానికని ప్రయత్నించాను. కానీ సాయం సమయాల్లో సముద్రపుటొడ్డున నడుస్తూవుంటే యశో మనో వీధిలో పరిమళం వెదజల్లుతూ పరుగెడుతున్న దృశ్యం కనబడేది. ఆమె జ్ఞాపక చిహ్నం నావద్ద ఏమీలేదు. అప్పుడు నా కాళ్లమీద తలపెట్టి ‘ఇక్కడే కాస్త చోటివ్వండి’ అన్న దృశ్యం మనస్సులో మెదిలేది. యశోలాంటి వనిత ఎంత బాధపడుతూంటే అలాంటిపనిచేస్తుందో నేను గ్రహించాను. అలాంటి సమయాల్లో నేను చేసిన పని వివేకవంతమైనదా కాదా అని నాలో నేను తర్కించుకునేవాడిని. కాని మరుక్షణంలోనే ఆ ఆలోచనల్ని తోసిపుచ్చేవాడిని. సుశీ చనిపోయిన తర్వాతకూడా ఈ విధంగానే చేసేవాడిని.
కాలక్రమేణా యశోని మరువడంలో కొంత వరకు సఫలీకృతుడ నయ్యాను.
ఏదో విధంగా ఏడాది గడిపేశాను. చదువైపోయింది. నా భారమంతా తీరిపోయింది. యశో ఎప్పుడో కాని తలుపుకు వచ్చేదికాదు. ఈ లోపున ఎన్నైన జరిగివుండవచ్చు. యశో నన్ను పూర్తిగా మరచిపోయి వుంటుంది. బహుశా వివాహం కూడా జరిగి ఉండవచ్చు. జరిగిందంతా మంచికే జరిగింది. ఈ ఉచ్చులోంచి ఎలాగైతేనేం బయటపడ్డాను. ఇక తిరిగి అందులో కాలుపెట్టను.
ఇంకొక ఏడాదికూడా గడచిపోయింది. ఇక ఆమెను పూర్తిగా మరచిపోగలనని ఆశించాను.
కొంతకాలం జీవితం సాఫీగా గడిచిపోయింది. ఇలా ఉండగా ఒక ఆరునెలల్లో తల్లిదండ్రులిద్దరూ గతించారు. క్రూరమైన ఆ దెబ్బకు నేను తట్టుకోలేకపోయాను. జీవితమంతా అంధకార బంధురమై పోయింది. నాకు సోదరులు లేరు; అక్కచెల్లెళ్లు లేరు; ఒంటరివాణ్ణి, బాబాయ్ ఒక్కడే నాకు దగ్గర బంధువు మిగిలాడు. కాని ఆయన అదొక తరహా మనిషి, లలిత పిన్నికి నేనంటే మమకారమే. కాని వారిది పుట్టెడు సంసారం. నా బాధ్యతకూడా ఎక్కడ వహించగలదు. ఉద్యోగం చేయాలనే వాంఛ నశించిపోయింది. డబ్బు గడించి ఎవరిని ఉద్ధరించాలి? నాన్న గారు వదిలిన దానితో నా పొట్ట గడుస్తుంది, అదేచాలు.
కాలం ఎంతో బరువుగా గడచిపోయేది. జీవితం కాంతివిహీనమైంది. దైవం మీద విశ్వాసం మరింత సడలింది.
ఒక నాటి రాత్రి యశోకి ఉత్తరం రాయాలని బుద్ధిపుట్టింది. ఆమెకు అందుతుందనే నమ్మకంలేదు నాకు. ఎక్కడ ఉందో ఆమె? మనస్సులోని బాధ కాగితం మీద పెడితే బరువైనా కొంతైనా తరుగుతుందని ఉత్తరం రాశాను. ఆమెకి అందుతుందన్న ఆశ ఉంటే బహుశా ఇంకొక విధంగా రాసేవాడిని. కొన్నాళ్లు గడిచేటప్పటికి ఉత్తరం మాటే మరచిపోయాను. ఇలా ఉండగా ఒకరోజు నాకొక ఉత్తరం అందింది. చాలా పెద్ద ఉత్తరం.
‘‘బాదల్ బాబూ,
నమస్కారమండీ. (జ్ఞాపకం ఉంది కదూ) మీ ఉత్తరం అందింది. నేను కొంచెం ఆశ్చర్యపోయాను. మీ నుంచి ఇన్నాళ్లకు జాబువస్తుందని నేననుకోలేదు. అస్వభావికమనీ కాదు. అవాంఛనీయమనీ కాదు. అప్రత్యాశితం కనుక చాలా కాలం క్రితం మీకు నేను చెప్పాను ప్రేమలేఖంటే నాకు తెలియదని, నాకుఎవరూ రాయలేదు. ఈ నాటికి మీ నుంచి అది లభించింది? మీరు నాకు ప్రియులు. అది మీ లేఖ గనుక ప్రేమలేఖేగా.
ఆ మీ లేఖ ఆఖరికి, ఎన్నో ఊళ్లు తిరిగి తిరిగి, చెక్కుచెదరక నాకు చేరిందంటే మీరు ఆశ్చర్యపోరా? నేను ఇక్కడికి వచ్చి ఒక సంవత్సరం కావొస్తుంది. చెప్పినా ఈ ప్రదేశం పేరు మీకు తెలియదు. అసలు తెలుసుకోవాల్సిన అవసరం ఏమిటి? మా నాన్న గారు చనిపోయిన మరుసటి నెలలోనే నేను ఇక్కడకు వచ్చేశాను. అప్పటినుంచీ ఇక్కడేఉంటున్నాను. ఈ ప్రదేశం పేరు చెప్పకుండా, ఎలా ఉంటుందో చెప్పకుండా ‘‘ఇక్కడ ఇక్కడ ’’ అంటూంటే కోపంగా ఉంది కదూ? మీకు కోపం వచ్చిందంటే నాకు తగని భయం. అందుకు చెప్తాను.
నేను నివసిస్తూ ఉంది ఒక రకం ఆశ్రమం లాంటిది. ఆ ఆశ్రమం అంటే రుద్రాక్షమాలలూ, భయంకరంగా మూడవకన్ను తెరచే సన్యాసులూ, నారచీరలు ధరించే సన్యాసినులూ జ్ఞాపకమొస్తున్నారు కదూ? కాదనను, అలాంటి వాళ్లు కూడా ఉన్నారిక్కడ. కాని నేనుకాదు. ఈ ప్రదేశం లో నాదొక చక్కటి కుటీరం, అందులో చాలా సాదా చీరలు ధరిస్తూ గడుస్తూంది నా నిరాడంబర జీవితం. కాని మీకు జవాబు రాస్తూ, ఇప్పుడు నేను కట్టుకున్న చీర చాలా విలువైంది. ఇది ఎప్పుడూ ఇక్కడకు వచ్చినతర్వాత కట్టుకోలేదు. ఏమిటా ‘ఇది’ అని ఆలోచిస్తున్నారా. గుర్తు తెచ్చుకోండి, మీరే చెప్పారే ఆనాడు; పసుపు పచ్చటి జార్జట్టు చీర కట్టుకుంటే నేను ముచ్చటగా ఉంటానని, అదే చీర ఇప్పుడు కట్టుకున్నాను. అన్నిటిని త్యజించేసుకున్నాదీనిని మాత్రం వదలలేకపోయాను. ఇంతరాత్రి సమయంలో ఈ చీర కట్టుకుని మిణుకుమనే ఈ దీపం దగ్గర కూర్చున్న నన్ను చూస్తే ఈ లోకంయేమంటుంది? అభిసారిక, ప్రేయసి అంటుంది కదూ. ఇందాకా మా రాణి అడిగింది. ‘ఏమిటిదంతా చెల్లీ’. ఈ చీర ఇప్పుడు కట్టుకున్నావేమిటి? అంటే నేను చెప్పాను. ‘నేను ఈ రాత్రి నా భర్తకు ఉత్తరం రాస్తున్నాను రాణీ.’
కాదంటారా? అంటే అనండి, నాకేం?
ముందు నేనిక్కడకు ఎందుకు వచ్చానో చెప్తాను మీకు. మీరు వెళ్లిపోయిన తర్వాత నాలో ఒకరకం ఉదాసీనత్వం, జడత్వమూ ప్రవేశించాయి. అర్థంలేని ఆడంబర జీవితంమీద విరక్తి కలిగింది. నన్ను ఎవరూ చూడకుండా ఉండాలనీ, చూసినా నన్ను పూర్వపు యశోగా గుర్తుపట్టకూడదనీ, ఎక్కడో ఎవరికీ తెలియని ప్రదేశంలో నివశించాలని వాంఛించాను. ఏకాంత జీవితం కోసం హృదయం తహతహలాడింది. అన్నట్టు చెప్పటం మరచిపోయా, ఇక్కడ నాపేరు యశోకాదు. ఇక్కడకు వచ్చిన వెంటనే మా గురువుగారు ‘సుందరీ’ అని నామకరణం చేశారు. నవ్వుతున్నారు కదూ. ఇక్కడ ప్రజలకి కూడా సౌందర్యపిపాస ఉందికదా యని కావచ్చు. కాని మీ లోకంలో లాగ అది ఇతరులకు హాని చెయ్యదు. సరే, ఆ బంగళా, ఆ ఆస్తినంతా అమ్మి ఇక్కడకు వచ్చేశాను. చాలా డబ్బే వచ్చింది. అదంతా బ్యాంకులో వేశాను. ఈ పనులన్నింటికీ రాజేంద్ర సహాయం పొందేను. తన గురించీ, సరళ గురించీ తర్వాత రాస్తాను. ముందర నా సంగతి అవనీయండి.
నేనెలా ఉన్నానో తెలుసుకోవాలని ఉందని రాశారు. నేను అంటే మీ ఉద్దేశ్యమేమిటి? నిగనిగలాడుతూ పచ్చగావున్న ఈ శరీరం ఉంది. బాహ్య నేత్రాలకి కనబడకుండా సహస్ర సూర్య ప్రమాణంతో ప్రకాశించే ఈ మనస్సు ఉంది. ఎందుకొ అందరూ నా శరీరానికే ప్రాముఖ్యత ఇస్తారు. నేను శరీరాలోచలని కట్టిపెట్టాను. పరులు కొనియాడే నా ఈ శరీర సౌందర్యాన్ని కాపాడు కోవటానికి ఇరవైమూడు సంవత్సరాలు వ్యర్థం చేశానా అనిపిస్తుంది. ఇంకా అజ్ఞానాంధకారంలో పడి కొట్టుకు పోమంటారా? ఆ దశని నేను దాటేశాను. ఇప్పుడు మనస్థైర్యం తప్ప మనోచాంచల్యం లేదు. నిశ్చలమైన ప్రేమ ఉంది. కాని దానిని అధఃపతనానికి తోసే మోహంలేదు. సూర్యోదయపు అరుణ కాంతిని చూస్తూంటే నా ఒళ్లు పులకరిస్తుంది. ప్రకృతిని నే నేనెన్నడూ జయించకలేక పోయాను. మీకు తెలుసు, దాన్నిచూసి నేను ఎలా మైమమరచిపోతానో. అయినాకాని, ఆనాడు కారులో లా ఈనాడు మైమరువను. ఎందుకంటే నేను ప్రకృతిలోనే జీవిస్తున్నాను, దానిలో ఒక భాగంగా. అదినాకు ఒక అందమైన దృశ్యం మాత్రమే కాదు; అదే నా సర్వస్వం. ఎప్పుడు నేర్చుకున్నా వీ కవిత్వం అంటారేమో; ఇది కవిత్వం కాదు. కవిత్వానికి ఊహ ఆయువుపట్టులాంటిది. దానికి కవి జీవం పోస్తాడు; కవిత్వం జీవితంలో ఒక భాగం మాత్రమే. అదే సర్వస్వం కాదు. కాని నాకిది సర్వస్వమూ అక్షయమూ కూడాను. దీనికి దేశ కాలాలతో నిమిత్తం లేదు; యుగాలతో ప్రమేయం లేదు. నా జీవితాన్ని అతి కృపణ్యంతో కొన్ని హద్దుల్లో నడుపుతున్నాను. ఇక ఆ అంచుదాటి ఒక అడుగుకూడా ముందుకు వేయను.
మీరు ఎగతాళి చేయనంటే ఓ మాట చెప్తాను. జన్మలనేవే వుంటే మళ్లీ జన్మలో నేనొక పుష్పాన్ని అయిపుట్టాలని చనిపోయేముందు కోరుకుంటాను. ఎందుకంటే సృష్టిలో దానిని మించిన అందమైనది వేరేలేదు. పుష్పపు వాసన నా ఆత్మను ఎక్క డెక్కడికో తీసుకు పోతుంది. అది నన్ను నిరర్ధక బంధనాల నుంచి విముక్తురాల్ని చేస్తుంది. ఇక్కడ చిన్న పూలతోట లోని రకరకాల పుష్పాలను ప్రాత.కాలములో కోస్తాను; కొన్నింటితో పూజచేస్తాను; మరి కొన్నింటిని తలలో పెట్టుకుంటాను. వాటి సుగంధ పరిమళం నాతోపాటు నలుదిశలా వ్యాపిస్తుంది. మొదటిసారి, పువ్వులు కోస్తూ కోస్తూ సువాసన లేని పుష్పాల దగ్గరకు వచ్చి అగిపోయా ను. అప్పుడు వాటిఅర్తనాదం వినిపించిందనిపించింది, “ఓ రమణి. మేము ఏం పాపం చేశాము. మాకు సువాసన లేకపోవచ్చు; కానీ మేమూ అందంగానే ఉంటాము. సృష్టికర్త విధించిన శిక్షే కాకుండా మానవులు కూడా మమ్మల్ని శిక్షించాలా?”. ఆ ఫుష్పవిలాపం నా హృదయాన్ని కదిలించగా అప్పుడు వాటిని సున్నితంగా తుంచాను, అప్పటినించి నా పూలదండలో సువాసన లేని పుష్పాల్ని కూడా జతచేయ మొదలెట్టాను.
పూలదండ శిగలో ధరించి సంధ్యా సమయాల్లో పిల్లవాయువులు వీస్తూంటే, గంగ ఒడ్డున పరుగెడు తున్నప్పుడు నా హృదయం ఆహ్లాదంతో నిండిపోతుంది. ఆ పిల్ల వాయువులు నా బుగ్గలను ఎంత చొరవగా తాకుతాయను కున్నారు! సూర్యరశ్మి, వెన్నెలకాంతి మరియు మలయమారుతము సోకని వనిత అసలు యీ భువిలో ఉండునా? అలాంటి సమయాల్లో మీ రూపం మెదులుతూ వుంటుంది. బంధాలన్నీ పూర్తిగా తెంచి వేశాను కానీ మీ బంధన తెంచటం నా శక్యంకాలేదు. సరే, తెంచబడని దానిని తెంచ ప్రయత్నించడ మెందుకని ఇక మానుకున్నాను. అందుచేత పూర్వపు జీవితానికి, నూతన జీవితానికీ మీరు ఒక్కరే లంకె.
అలాగ ఇక నాకు మిగిలిన గత జీవిత స్మృతి మీరొక్కరిదే. అందువలన కొన్ని కొన్ని సమయాల్లో నేను భయపడుతూ ఉంటాను - నాలో అజ్ఞాతమైన కోరికలు అణగారి ఉన్నాయేమోనని అనుభవాన్ని ఆశించే వాంఛలు మరుగుపడి ఉన్నా ఏమోనని? మీ ఛాయలో మెదిలే నా మనసు, నేను ఆశించే ఆత్మ సంయమనం ఇంకా నాకు లభింపనీయ లేదు. నాకు లభించింది సహనము మాత్రమే, శాంతి కాదు. నిర్దుష్ట మైన శాంతి లభించినప్పుడే ఆత్మ సంయమనం పరిపూర్ణంగా లభిస్తుంది. దానికోసం నేనింకా ఎంత కాలం ప్రయాణం చేయాలో! సరే, నా గురించి చాలా రాశాను. మొదట నేనంత రాద్దామనుకోలేదు, కానీ కలం నడుస్తూన్నంత కాలం దానిని ఎందుకు వారించాలి?
ఇక సరళా రాజేంద్రల సంగతి. వారిద్దరికీ నేను ఇక్కడకు వచ్చేముందు వివాహమైంది. అది నాకు చాలా సంతోషం కలిగించింది. మీరు వెళ్లిపోయిన తర్వాత చాలా కాలం వరకూ రాజేంద్ర నన్ను వేధించాడు. ఒక సారి వివాహం సంగతి ప్రస్తావిస్తే నేను చెప్పేశాను. ‘నా హృదయం పరాధీన’ మని. నావలన అతను ఏది నష్టపోలేదు; ఏమీ కష్టాలు పడలేదు. అందుచేత అతని రుణం నామీద లేదు. అయినా అతడు నాకు చాలా సహాయం చేశాడు. ఇక సరళ సంగతి మీకు తెలుసు ఎంత చెంచెల చిత్తయో. ఏదయితేనేం వీరిద్దరికీ వివాహం జరిగింది. మంచిదే.
ఇక మీ సంగతి. పూజ్యులైన మీ తల్లిదండ్రులు పరమపదించారని విని నేను ఎంతో దు.ఖించాను. వారి దర్శనభాగ్య మైనా నాకు కలుగలేదు. జీవితంలో అత్తమామల ప్రేమ నాకిక లభించ దన్న మాట. ఈ మాటలు ఏదో మర్యాద పూర్వకంగా అంటూన్నాని మీరను కోకండి. నిజంగానే వారి ఆశీర్వాదాలు పొందాలని తీవ్రవాంఛ ఉండేది. ఏ పని స్వంతంగా చేయలేదు మీరు. అలాంటి విషాద పరిణామాన్ని ఎలా తట్టుకున్నారు మీరు.
మీ గురించి మీరు చాలా తక్కువగా రాశారు. మీమీద మీరే అభియోగాలు వేసుకున్నారు. అది మీరు ఆత్మ పరిశోధన అనుకున్నరేమో. అది ఎన్నటికీ కాదు. అది ఆత్మనింద మాత్రమే. మీరు రాశారు - మానసికంగా నేను చాలా పిరికివాడిని. దుర్భలుడిని. నన్ను నమ్మినవారెవ్వరూ సుఖపడలేదు. అమ్మీ, సుశీ సంగతే చూడు. ఆమె నన్ను నమ్ముకుంది. చివరకు ఏమైంది. ఆమెకు నేను తగనని దైవమే ఆమెను నానుండీ వేరు చేశాడు. ఇక నీ సంగతి. నన్ను సర్వవిధాలా నమ్ముకున్న నిన్ను మోస పుచ్చి నడి సముద్రంలో వదిలి వచ్చాను. ఎందుచేత? నీ అపరాధంయేమిటి? ఏమీ లేదు. నన్ను నువ్వు ప్రేమించడమే నీ అపరాధం. అసలు నీకు మొట్ట మొదటే సుశీ సంగతి చెప్పాల్సింది. అలా అయినట్లైతే మన ఇద్దరిమధ్యా ఈ బాంధవ్యం ఏర్పడక పోనేమో. అయినా నేను బాధపడే దేమంటే సుశీ ..యశోల ఎడ నా కర్తవ్యం నేను నెరవేర్చలేక పోయాను. చివరకు ఈనాడు నన్ను నేను నమ్ముకోలేకపోతున్నాను.
మీ వాక్యాల్లోంచి అశాంతి మానసిక క్షోభ తొంగి చూస్తున్నాయి. అలా ఎందుకుండాలి? మీ అభియోగాలకి నేను జవాబిస్తాను. మిమ్మల్ని నమ్మన వారెవ్వరూ సుఖపడ లేదన్నారు. సుశీని గురించి ప్రస్తావించారు. సుశీ విషయం మీరు చెప్పినప్పటి నుంచీ నేను చాలా యోచించాను. సుశీ అక్కయ్యకు నమస్కారం చేయలేక పోయాననే విచారం ఎన్నటికీ విడనాడదు. కాని ఆమె చాలా అదృష్టవంతురాలు, మనస్ఫూర్తిగా మిమ్మల్నే ప్రేమించింది. మీ ఆదరణ తిరిగి సంపాదించింది. జీవితంలో ఆమె ఎవరికి కష్టం కలిగించలేదు. తనూ ఇతరుల వల్ల కష్టపడ లేదు. ‘అంతిమ సమయం అందరికి ఆసన్న మయ్యేదే కదా. ఆమె మీ ఒడిలో చనిపోయింది. అంతకంటె ఇంకేమి కావాలి? నేను కూడా మిమ్మల్ని సుశీ యాచించిన భిక్షే యాచిస్తున్నాను. నాక్కూడా అలాంటి మరణమే సంప్రాప్తించేటట్టు ఆశీర్వదించండి. ఎక్కడున్నా సరే. అంతిమ సమయంలో మీరాక కెదురు చూస్తూంటాను. జీవన్మరణాల మధ్య ఊగిసలాడే సమయంలో బాదల్ బాబు దర్శనంకోసం నాకళ్లు స్వాతి వానకెదురు చూసే ముత్యపు చిప్పలా కాయలు కాసి ఉంటాయి. మీరాక మునుపే నేను చనిపోయినట్లైతే నేను మహా పాపినన్నమాట.
మీరు అనవసరంగా బాధపడకండి. సుశీ, ఎడే కాకుండా, మీరు యశో ఎడ కూడా కర్తవ్యం నిర్వహిస్తున్నారు. మీ ఉన్నతి గురించీ, మీ సుగుణాల గురించీ, మీఎడ నా అభిప్రాయం గురించీ నేను చెప్ప నవసరం లేదు. అని నా నరనరాలకీ తెలుసు. ఒక్కమాట మట్టుకు నేను ఇక్కడ చెప్తాను. మీ జీవితపు చరిత్రలో మీరు సిగ్గుతో తల వంచుకోవాల్సిన సంఘటన ఏదీలేదు. అంతేకాదు, మిమ్మల్ని ప్రేమించిన వారు మిమ్మల్ని చూసి గర్వ పడతారు. ఈ మాటల్ని మీరు వివ్వసించండి; నన్ను కరుణించండి.అంతే.
ఇంకొక మాట మీకు అక్కడ మనశ్నాంతి కరువైనా లేక నాదగ్గరకు రావాలనిపించినా, ఇక్కడికి వచ్చేయండి. ఒక్కరూ ఏమి చేస్తా ర్కకడ; ఈ ఆశ్రమం డూన్ కి యాభై మైళ్ల దూరంలో ఉంది. నేను ‘రాణి ’ అని ఇంతకుముందు చెప్పానే ఆమె ఇంకెవరోకాదు ...లఖియా. సరళ చెప్పింది కదా ఆమె సంగతి. చాలా మంచిది. మేమిద్దరం ప్రాణస్నేహితుల మయ్యాము. అంత శాంత స్వభావిని. సత్యశీల, నిష్కల్మషురాలు అరుదుగా కనబడుతుంది ఈ పాప భూయిష్టమైన ప్రపంచంలో ఆమెనుకూడా చూద్దురు కాని. ఇక్కడికి వచ్చేయండి. మీ గురించి ఆమెతో చాలా చెప్పాను; ఇంతే
ఇక వుంటా
మీ యశో”
చాప్టర్ 16
ఆ ఉత్తరం అందిన ఒక వారం రోజుల తర్వాత ముస్సోరీ బయలుదేరాను. దానిముందర, వెళ్లటమా, మానటమా అని నాలో నేను చాలా తర్కించుకున్నాను. ఏకాంతజీవితంలో పూర్తిగా విసిగిపోయాను. యశో సన్యాసిని అయిందంటే నేను నమ్మలేకపోయాను. ఆమెను చూడాలనే వాంఛ ఆ వార్త విన్న తర్వాత హెచ్చింది. అయినా యశో ఉత్తరం ఒక సన్యాసిని రాసిన దానిలా అనిపించడంలేదు! లఖియా కూడా అక్కడే ఉందని విని ఆమెని చూడాలనే ఆత్రుత కలిగింది. ఆమె కథ నేనెన్నడూ మరువలేదు. యశో, లఖియా అక్కడ కలుసుకోవటం ఎంత ఆశ్చర్యంగా ఉంది. వెళ్లటానికే నిశ్చయించాను. అన్ని భారాలతోపాటు ఇంటిభారం, భూముల భారం బాబయ్యమీద పెట్టాను. డెహ్రాడూన్ చేరుతూ అనుకున్నాను - మొదటి సారి వెళ్ళినప్పుడు నా రాక కోసం యశో ఆమె తండ్రి ఎదురుచూస్తున్నారు రైల్వే ప్లాట్ఫారం మీద, ఇప్పుడు ఆ ఇద్దరిలో ఒకరు స్వర్గంలో ఉన్నాను. ఇంకొకామె ఆశ్రమంలో ఉంది. మొదటిసారి సుశీని మరచిపోవటానికి వెళ్ళేను; రెండో సారి యశోను వెదకటానికి వచ్చాను.
నాకు యశోమీద కోపం వచ్చింది. మూర్ఖురాలు ఆశ్రమం ఎక్కడవుందో, అక్కడకు ఎలా జేరాలో, ఏమీ రాయలేదు. ఈ మాత్రం తెలియదా? ఇప్పుడు నేనెంత బాధపడాలి? నాకు ఒకేఒక ఆశ కలిగింది. సరళను కలుసుకోగలిగితే. ఆమె ఎక్కడుందో యశో రాయలేదు. సహజమంగా అత్తవారింట్లోనే ఉంటుంది ముముస్సోరిలో; బహుశా యశో అందుకే రాయలేదేమో. సామాను క్లోక్ రూమ్ లో వదిలి, ముస్సోరి కి బయలుదేరాను. ముస్సోరి చేరుతూనే చూచాయగా గుర్తున్న సరళా-రాజేంద్ర గృహాన్వేషణ మొదలుపెట్టాను. బజారులోంచీ పోతున్నాను.
రామం బాబూ.’ అని ఎవరో పిలిచినట్లైంది. పక్కకు చూశాను. ఇంకెవరు సరళే! షాపులోంచిబయటికి వస్తూ కనబడింది.
‘‘ఎప్పుడు వచ్చారు రామంబాబూ. తలవని తలంపుగా కనబడ్డారు. ఎక్కడి కిలా వెళ్తున్నారు?’’ అంది దగ్గరకు వచ్చి.
‘‘ఇప్పుడే వచ్చాను సరళా. మీ ఇంటికే బయలుదేరాను,’’ అన్నాను.
‘‘భలేవారే మీరు. మా ఇల్లు బజారులో ఉందని ఎవరు చెప్పారు మీకు? క్రిందటి సారి మా ఇంటికి వచ్చారుగా!’’ అంది నవ్వుతూ.
అప్పుడే రాజేంద్ర కూడా వవచ్చాడు రెండు షాపింగ్ బాగ్స్ తో.
‘‘మీకు ఇంకా తెలియదనుకుంటాను, ఈయనగారు మా శ్రీవారు. మీకు శుభలేక పంపటం ఇష్టంలేక వెయ్యలేద,’’ అంది సరళ రాజేంద్ర చెయ్యి పట్టుకుని .
అందుకు నేను కారణమడుగలేదు కాని ఇద్దరినీ కంగ్రాజులేటు చేశాను.
‘‘రాజేంద్ర, మీకు ఇంకా ఏదో పని ఉందన్నారు కదా. అది చూసుకుని రండి. నేను ఈయనను ఇంటికి తీసుకెళ్తాను,” అంది సరళ.
రాజేంద్ర
Comments (0)